'Please Be Part Of Our Tourism': భారత పర్యాటకులారా దయచేసి మా దేశానికి రండి, ఇండియన్లను బతిమాలుకుంటున్న మాల్దీవులు
Modi-in-Lakshadweep (Photo-ANI)

New Delhi, May 7: భారత్‌, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ప్రభావంతో.. అక్కడి పర్యాటకం చాలా దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత్‌ను బతిమాలడం మొదట్టింది. తమ దేశ పర్యాటకంలో మళ్లీ భాగం కావాలని మాల్దీవుల పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహీం ఫైసల్‌ భారత్‌ను కోరారు.

సోమవారం ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మాక్కూడా ఓ చరిత్ర ఉంది. మాల్దీవుల్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్యానికి భారత్‌తో కలిసి పని చేయాలని ఉంది. మేము ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక పరిస్థితులను పెంపొందించుకోవాలని ఆశిస్తున్నాం. భారత్‌ నుంచి వచ్చేవారికి మాల్దీవుల ప్రజలు, ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలుకుంది. దయ చేసి భారతీయులు మాల్దీవుల పర్యాటకంలో తిరిగి మళ్లీ భాగం కావాలని కోరుతున్నా. మా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పర్యాటకం ఆధారపడి ఉంటుంది’ అని ఇబ్రహీం ఫైసల్‌ భారత్‌ను కోరారు. భారత పర్యాటకులను బతిమాలుకుంటున్న మాల్దీవుల టూరిజం, ఆకర్షణకు ఇండియాలోని ప్రధాన నగరాల్లో రోడ్ షోలు ఏర్పాటు చేయాలని నిర్ణయం..

ప్రధాని మోదీ (PM Modi) భారత్‌లో అంతర్భాగమైన లక్షద్వీప్‌ దీవులను జనవరిలో సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడి పర్యటక అద్భుతాలను హైలైట్‌ చేస్తూ ఫొటోలు, వీడియోలు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. దీనిపై అనవసరంగా జోక్యం చేసుకున్న మాల్దీవుల (Maldives) మంత్రులు.. భారత్‌ సహా ప్రధానిపై నోరుపారేసుకున్నారు.

దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి. మరోవైపు చైనా అనుకూలుడైన ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) భారత దళాలను వెనక్కి పంపాలని నిర్ణయించటంతో సంబంధాలు మరింత క్షీణించాయి. దీంతో ఆ మంత్రుల వ్యాఖ్యలను భారతీయులు తీవ్రంగా ఖండించారు. ఇక నుంచి తాము మాల్దీవుల పర్యటన రద్దు చేసుకుంటామని పలువురు భారతీయ ప్రముఖులు పేర్కొన్నారు.  ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై దుమారం, ముగ్గురుని మంత్రి పదవుల నుండి సస్పెండ్ చేసిన అక్కడి ప్రభుత్వం

విమాన, హోటల్‌ బుకింగ్‌లను క్యాన్సిల్‌ చేశారు. కొన్ని ట్రావెల్‌ ఏజెన్సీలు ఆ దేశానికి తాత్కాలికంగా బుకింగ్‌లను నిలిపివేశాయి. దీంతో అప్పటి వరకు మాల్దీవులను సందర్శిస్తున్న పర్యటకుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న భారత్‌ ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయింది. 2024 తొలి నాలుగు నెలల్లో భారత పర్యటకుల సంఖ్య దాదాపు 50 శాతం పడిపోయింది.

అప్పటి నుంచి మాల్దీవులు పర్యాటకం దెబ్బతింది. మరోవైపు.. చైనా అనుకూల వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు విధానాల వల్ల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవుల్లో ఉన్న భారతీ సైనిక దళాలను వెనక్కి తీసుకోవాలని మొయిజ్జు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి దశలో కొంత మంది సైనికులు భారత్‌కు వచ్చారు.

పర్యటకశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. క్రితం ఏడాది జనవరి - ఏప్రిల్‌ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది. ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదిక వెల్లడించింది. చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న ముయిజ్జు (Mohamed Muizzu) భారత దళాలను వెనక్కి పంపి కయ్యానికి కాలుదువ్వారు. అంతకుముందు మాల్దీవుల వ్యవహారాల్లో భారత్‌ జోక్యం ఎక్కువవుతోందంటూ ప్రచారం చేసి సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే.