2016 EgyptAir Crash (Photo-Wikimedia Commons)

Cairo, April 28: మే 19, 2016న ఈజిప్ట్ ఎయిర్ ఫ్లైట్ కైరోకి వెళ్లే మార్గంలో కూలిపోయి, మొత్తం 66 మంది ప్రయాణికులు మరణించిన సంగతి విదితమే. దీనిపై విచారణ చేపట్టిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. విమానం గాల్లో వెళ్తుడగా పైలట్‌ నిర్లక్ష్యంగా కాక్‌పిట్‌లోనే సిగరెట్‌ వెలిగించడంతో.. మంటలు (2016 EgyptAir Crash) వ్యాపించాయి. దీంతో సముద్రంలో విమానం కూలింది. ఈ ప్రమాదంలో అందులోని 66 మంది మరణించారు. ఈజిప్ట్‌ విమాన దుర్ఘటనపై ఫ్రెంచ్‌ ఏవియేషన్‌ నిఫుణులు ఈ నివేదిక విడుదల చేశారు.

ప్రమాదానికి దారి తీసిన కారణాలను అందులో పేర్కొన్నారు. 2016 మే 19న ఈజిప్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంఎస్‌804 ఎయిర్‌బస్‌ ఏ320 విమానం (EgyptAir flight MS804) ఫ్రాన్స్‌ రాజధాని పారిస్ నుంచి ఈజిప్ట్‌ రాజధాని కైరోకు బయలుదేరింది. అయితే అనూహ్యంగా క్రీట్ ద్వీపం సమీపంలోని తూర్పు మధ్యధరా సముద్రంలో ఆ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 66 మంది మరణించారు. చనిపోయిన వారిలో 40 మంది ఈజిప్టు దేశీయులు, 15 మంది ఫ్రెంచ్ జాతీయులు, ఇద్దరు ఇరాకీలు, ఇద్దరు కెనడియన్లు, అల్జీరియా, బెల్జియం, బ్రిటన్, చాడ్, పోర్చుగల్, సౌదీ అరేబియా, సూడాన్ దేశాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

కాగా, విమానం 37,000 అడుగుల ఎత్తులో ఎగురుతుండగా గ్రీకు ద్వీపం కర్పాథోస్ నుంచి 130 నాటికల్ మైళ్ల దూరంలో అదృశ్యమైంది. ఉగ్ర దాడి వల్లనే విమానం కూలినట్లు ఈజిప్ట్‌ నాడు ఆరోపించింది. బాధితుల శరీరాలపై పేలుడు పదార్థాల జాడలు కనుగొనబడ్డాయి, అయితే ఆ వాదనలు విస్తృతంగా తిరస్కరించబడ్డాయి. సముద్రంలో కూలిన విమానంలోని ప్రయాణికుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. గ్రీస్‌కు సమీపంలోని సముద్రంలోబ్లాక్‌ బాక్స్‌ను గుర్తించారు.

మరోవైపు ఈజిప్ట్‌ విమాన దుర్ఘటనపై ప్రెంచ్‌ ఏవియేషన్‌ దర్యాప్తు చేపట్టింది. పైలట్‌ కాక్‌పిట్‌లో సిగరెట్‌ వెలిగించడమే (Fire was Caused By Pilot's Cigarette) ప్రమాదానికి ప్రధాన కారణమని వైమానిక రంగ నిఫుణులు ఆరోపించారు. అత్యవసర ఆక్సిజన్‌ మాస్క్‌ నుంచి లీకేజీ వల్ల మంటలు వ్యాపించాయని, దీంతో ఆ విమానం సముద్రంలో కూలిందని పేర్కొన్నారు. ఈజిప్టు పైలట్లు కాక్‌పిట్‌లో ధూమపానం చేస్తుంటారని, ఈజిప్ట్‌ ఎయిర్‌లైన్స్‌ దీనిని నిషేధించలేదని ఫ్రాన్స్‌ ఏవియేషన్‌ నిఫుణులు విమర్శించారు. ఈ మేరకు 134 పేజీల రిపోర్ట్‌ విడుదల చేశారు. ఈ నివేదికను పారిస్‌లోని అప్పీల్ కోర్ట్‌కు పంపారు.