New Delhi, Feb 11: కరోనా మహమ్మారి ధాటికి భారత్‌లో (India) కాకుండా....ప్రపంచవ్యాప్తంగా 4,355 మంది భారతీయులు మృతి (Indians died of Corona) చెందారు. మొత్తం 88 దేశాల్లో భారతీయులు కరోనా భారిన పడి మరణించినట్లు కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించిన డేటాను పార్లమెంట్ లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. సౌదీ అరేబియా (Saudi Arabia), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోనే అత్యధిక కరోనా మరణాలు నమోదయ్యాయి. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ (V Muraleedharan) గురువారం రాజ్యసభలో (Rajya Sabha) లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కరోనా సోకిన భారతీయుల్లో సౌదీ అరేబియాలో గరిష్ఠంగా 1,237 మంది, యూఏఈలో 894 మంది మరణించినట్లు తెలిపారు. కరోనా మృతుల అంత్యక్రియల కోసం మొత్తం 127 మృతదేహాలను భారతదేశానికి తీసుకువచ్చినట్టు ఆయన ప్రకటించారు. ఈ రెండు పశ్చిమాసియా దేశాల్లో 60 లక్షల మందికిపైగా భారతీయులు నివసిస్తున్నారు.
కేంద్రం ఇచ్చిన డేటా ప్రకారం.. ఇతర దేశాల్లో బహ్రెయిన్ (Bahrain) లో 203 మంది, కువైట్ (Kuwait) లో 668, మలేషియాలో 186, ఒమన్ లో 555 మంది, ఖతార్ లో113 మంది కరోనాతో మరణించారు. భారత విదేశీ మిషన్లకు అటువంటి అభ్యర్థనలు వచ్చినప్పుడల్లా మృతదేహాలను భారతదేశానికి తరలించడానికి లేదా స్థానికంగా ఖననం చేయడానికి ఆర్థిక సహాయం భారతీయ కమ్యూనిటీ సంక్షేమ నిధి నుంచి అందినట్టు మురళీధరన్ చెప్పారు. కరోనాతో మరణించిన భారతీయుల మృతదేహాలను తిరిగి తీసుకురావడానికి ఆరోగ్య, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు సూచించిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఆంక్షలు ఉండవన్నారు. విదేశాల్లోని రాయబార కార్యాలయాలకు ఈ మేరకు అభ్యర్థనలు వచ్చాయని చెప్పారు.
రాజ్యసభలో మరొక ప్రశ్నకు సమాధానంగా.. కరోనా కాలంలో 6 పశ్చిమాసియా దేశాల నుంచి 716,662 మంది భారతీయులు ప్రత్యేక స్వదేశీ విమానాలలో తిరిగి వచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ (external affairs minister S Jaishankar ) చెప్పారు. యూఏఈ నుంచి 3,30,058 మంది, సౌదీ అరేబియా నుంచి 1,37,900 మంది, కువైట్ నుంచి 97,802 మంది, ఒమన్ నుంచి 72,259 మంది, ఖతార్ నుంచి 51,190 మంది, బహ్రెయిన్ నుంచి 27,453 మంది తిరిగి భారత్‌కు చేరుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. కరోనా ప్రభావం కారణంగా గల్ఫ్‌లోని పెద్ద సంఖ్యలో భారతీయ కార్మికులు భారతదేశానికి తిరిగి వచ్చారని జైశంకర్ తెలిపారు. యూఎఈలోని భారతీయ బ్లూ కాలర్ వర్కర్లు వారి ఉపాధిని, వేతనాలను మెరుగుపరచడానికి 2021 జనవరిలో ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవలి నెలల్లో మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో, కార్మికులు, కుటుంబాలను త్వరితగతిన తిరిగి వచ్చేలా దృష్టి సారించిందని జైశంకర్ చెప్పారు.