Kenya Cult Deaths: జీసస్‌ను కలుసుకోవాలని కఠిన ఉపవాసం, ఆకలితో అలమటించి 47 మంది మృతి, కెన్యాలో విషాదకర ఘటన వెలుగులోకి..
Kenya Cult Deaths (Photo-Twitter)

Nairobi, April 24: కెన్యాలోని కిల్ఫీ ప్రావిన్స్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ చర్చిలో మతపెద్ద బోధనలతో ప్రభావితం అయిన భక్తులు కఠిన ఉపవాసం బలవన్మరణానికి పాల్పడ్డారు.ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. బలవన్మరణాకి పాల్పడిన సంఘటనా స్థలంలో తవ్వే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయని పోలీసులు తెలిపారు.

కిల్ఫీ ప్రావిన్స్ లోని షాకహోలా అటవీ ప్రాంతంలో గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్ బోధకుడు మాకెంజీ ఎన్ థాంగే ఈ దారుణానికి కారణమని కెన్యా పోలీసులు చెప్పారు. ప్రార్థన కోసం చర్చికి వచ్చే వారిని ఈ దారుణ మూఢభక్తి వైపు ప్రోత్సహించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జీసస్ ను కలుసుకోవాలని అనుకుంటున్న వారు ఆకలితో అలమటించి మరణించాలని మాకెంజీ పిలుపునిచ్చాడని తెలిపారు. ఇలా చనిపోయిన వారిని పాతిపెడితే వారు పరలోకానికి వెళతారని, అక్కడ జీసస్ ను కలుసుకుంటారని చెప్పాడన్నారు.

సూడాన్‌లో ముదిరిన సంక్షోభం, అంతర్యుద్ధంలో 413 మంది మృతి, భారతీయులను తరలించేందుకు ఐఏఎఫ్‌ విమానాలను సిద్ధం చేసిన విదేశాంగ శాఖ

ఫాస్టర్ మాకెంజీ బోధనలకు ప్రభావితమైన వారు కఠిన ఉపవాసం చేసి ప్రాణం తీసుకున్నారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కూడా ఉన్నారు. ఉపవాసంతో మరణించిన వారిని అటవీ ప్రాంతంలో పాతిపెట్టినట్లు బయటపడింది. దీంతో పోలీసులు మాకెంజీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ దారుణానికి సంబంధించిన వివరాలు బయటపడ్డాయి.

సూడాన్‌లో రోడ్ల మీద ఎటుచూసినా శవాలే, భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచన, భారత ఎంబసీకి ఎవరూ వెళ్లద్దని ఆదేశాలు

షాకహోలా ప్రాంతంలో తవ్వకాలు జరపగా ఈ నెల 11న 11, ఆదివారం మరో 26 మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, ఫాస్టర్ మాకెంజీ బోధనల మేరకు కఠిన ఉపవాసం చేస్తున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రావడంతో వీరంతా అటవీ ప్రాంతంలో దాక్కుని మరీ ఉపవాసం కొనసాగించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, మృతదేహాల కోసం తవ్వకాలు జరుపుతూనే ఆ ప్రాంతంలో ఇంకా ఉపవాసం చేస్తున్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఈ దారుణ ఘటనపై నిందితుడు ఫాస్టర్ మాకెంజీ స్పందిస్తూ తాను ఎవరినీ ఆత్మహత్యకు ప్రోత్సహించలేదని చెప్పాడు. 2019లోనే చర్చిని మూసేశానని వివరించాడు. ఈ మరణాలతో తనకు సంబంధం లేదని వాదిస్తున్నాడు. ఈ క్రమంలో 47 మంది ఆహారం తీసుకోకపోవడం వల్లే చనిపోయారని నిరూపించేందుకు అధికారులు మృతదేహాల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించారు. మరోవైపు, ఫాస్టర్ మాకెంజీ గతంలో కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. ఇద్దరు చిన్నారుల మరణానికి కారణమయ్యాడనే కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే, జరిమానా చెల్లించి ఈ కేసు నుంచి మాకెంజీ బయటపడ్డాడని వివరించారు.