యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం డ్రోన్ దాడి (Abu Dhabi Airport Attack) జరిగింది. ఈ డ్రోన్ దాడిలో మూడు అయిల్ ట్యాంకర్లు పేలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తాన్ జాతీయుడు మరణించగా (2 Indians, 1 Pakistani National Killed) ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.అబుదాబి విమానాశ్రయంలోని ఓ నిర్మాణ స్థలంలో మంటలు చెలరేగాయని, ఏడీఎన్‌ఓసీ సంస్థకు చెందిన చమురు నిల్వలు ఉన్న పారిశ్రామిక ప్రాంతం ముసఫాలో మూడు ఇంధన ట్యాంకర్ ట్రక్కులు పేలిపోయాయని పోలీసులు తెలిపారు.
ఘటన స్థలంలో చిన్న విమానానికి సంబంధించిన భాగాలు కనిపించాయని, రెండు ప్రదేశాల్లో చోటు చేసుకున్న పేలుడు, అగ్ని ప్రమాదానికి డ్రోన్ దాడులు కారణమని పోలీసులు పేర్కొన్నారు. డ్రోన్ దాడులకు తామే పాల్పడ్డామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా డ్రోన్లకు సంబంధించి చిన్న ఎగిరే వస్తువులను ప్రాధమిక దర్యాప్తులో గుర్తించినట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. ఆ రెండు ప్రాంతాల్లో పడటంతో పేలుడు, మంటలకు కారణమై ఉండవచ్చని చెప్పారు. ఈ ఘటనల వల్ల పెద్దగా నష్టం ఏమీ జరగలేదన్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతుందని వివరించారు.