Afghanistan President Ashraf Ghani (Photo Credits: IANS)

Kabul, March 9: ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan) బాంబులతో దద్దరిల్లింది. దేశ రాజధాని కాబుల్‌లో (Kabul) అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ (Mohammad Ashraf Ghani) ప్రమాణ స్వీకార సమయంలో తాలిబన్లు బాంబు దాడులకు పాల్పడ్డారు. అనంతరం తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు.. తాలిబన్లపైకి ఎదురుకాల్పులు చేపట్టారు. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ దాడితో ప్రమాణస్వీకారానికి వచ్చిన వారంతా భయబ్రాంతులకు గురయ్యారు.

అయితే ఇది ఉగ్రవాద చర్య అవునా? కాదా? అనేది నిర్థారణ కాలేదు. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం తదితర ఇంకా అధికారిక సమాచారం లేదు. కాగా అష్రఫ్ ఘనీ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. పేలుళ్ళు సంభవించిన తర్వాత అష్రఫ్ ఘనీ మాట్లాడుతూ, ‘‘నేను బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించలేదు, కేవలం చొక్కా మాత్రమే వేసుకున్నాను. నా తలను త్యాగం చేయవలసి ఉన్నా నేను ఇక్కడే ఉంటాను’’ అని పేర్కొన్నారు.

ANI Tweet:

 

అంతకుముందు ప్రత్యర్థులైన ఆఫ్ఘనిస్థాన్ నేతలు అష్రఫ్ ఘనీ, అబ్దుల్లా అబ్దుల్లా (Abdullah Abdullah) వేర్వేరుగా ఆ దేశాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రెండు కార్యక్రమాలను వందలాది మంది వీక్షించారు. అదే సమయంలో అష్రఫ్ ఘనీ ప్రమాణ స్వీకార వేదిక వద్ద బాంబు పేలుళ్ళు, తూటాల పేలుళ్ళు సంభవించాయి. కాగా ఇద్దరు నేతలు దేశాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో తాలిబన్లతో చర్చలు గందరగోళంలో పడ్డాయి. శాంతి ఒప్పందాన్ని ఏవిధంగా అమలు చేయాలనే అంశంపై అమెరికాకు కూడా ఇది సందిగ్ధ పరిస్థితే.