Free Balochistan Movement goes viral in social media.| Photo : Twitter

"చేసిన పాపం తిరిగొస్తుంది, కర్మ ఎవరిని వదిలిపెట్టదు" అనే నానుడి ఇప్పుడు పాకిస్థాన్ దేశానికి సరిగ్గా వర్తిస్తుంది. కాశ్మీర్ తమది అంటూ ఎప్పుడు భారత్ తో కయ్యానికి కాలు దువ్వే దయాది దేశం ఇప్పుడు ఇంటి పోరును ఎదుర్కొంటుంది. తమ ఆధీనంలోనే గల ఒక ప్రాంతం ప్రజలు పాకిస్థాన్ నుంచి విముక్తి కోరుకుంటున్నారు. ఈరోజు ఆగష్టు 14 పాకిస్థాన్ లో ఒకవైపు స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటుంటే, మరోవైపు పాక్ నైరుతి భూభాగమైన బెలూచిస్థాన్ ప్రాంత ప్రజలు 'బ్లాక్ డే' ను పాటిస్తున్నారు. తాము ఎంత మాత్రం పాకిస్థానీయులం కాదని, తమకు పాక్ నుంచి స్వేచ్ఛా, స్వాతంత్రాలు కావాలని బెలూచిస్థాన్ ప్రజలు ఉద్యమం లేవనెత్తారు.

బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత మార్చ్ 27, 1948 నుంచి బెలూచిస్థాన్ భూభాగాన్ని ఇక్కడి ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ ఆక్రమించింది అంటూ అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. తాము ఇప్పటికీ బెలూచీలుగానే ఉండాలనుకుంటున్నట్లు వారు కోరుకుంటున్నారు.

 

పాక్ స్వాతంత్ర దినోత్సవం రోజున బెలూచిస్తాన్ ఉద్యమం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీంతో గ్లోబల్ మీడియా కూడా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తుంది.

 

కాశ్మీర్ భూభాగాన్ని 'భారత్ ఆక్రమిత ప్రాంతం'గా అభివర్ణించే పాకిస్థాన్ కు ఇప్పుడు ఈ బెలూచిస్థాన్ ఉద్యమం పెద్ద చెంపదెబ్బ అని చెప్పవచ్చు. తన వక్రబుద్ధితో భారత్ నుంచి కాశ్మీర్ ను విముక్తి చేయాలి. భారత్ నుంచి కాశ్మీర్ ప్రజలకు స్వతంత్రం కావాలి అంటూ అమాయకులైన కాశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టే పాక్ ప్రభుత్వం మరియు వారి మీడియా ఇప్పుడు ఈ బెలూచిస్తాన్ వ్యవహారాన్ని ఎలా చక్కబెడుతుందో చూడాలి.

కాగా, బెలూచిస్తాన్ ఉద్యమమేమి ఈనాటిది కాదు, చాలా సార్లు బెలూచీలు పాక్ కు వ్యతిరేకంగా తమ గొంతుక వినిపించారు. అయితే ఎప్పటికప్పుడు పాక్ వారి ఉద్యమాన్ని అణిచివేస్తూ వస్తుంది. లక్షల మంది బెలూచీలను హతమార్చి పెద్ద నరమేధాన్నే సృష్టించింది. అబద్ధాలనే అలవాటుగా మార్చుకున్న పాకిస్థాన్, ఈ బెలూచిస్థాన్ ఉద్యమం కూడా భారత ప్రేరేపితమని, తమ ప్రాంతంలో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందంటూ విషయాన్ని డైవర్ట్ చేస్తూ వస్తుంది.

వాస్తవానికి మాత్రం బెలూచిస్తాన్ ప్రాంతంపై పాకిస్థాన్ ప్రభుత్వం ఆధిపత్యం వహించడానికి ప్రధాన కారణం అక్కడ 'సూయి' అనబడే సహజమైన గ్యాస్ నిక్షేపాలు ఉండటమే, అరబ్ దేశాలకు ఆనుకొని ఉన్న బెలూచిస్తాన్ ప్రాంతంలో అపారమైన గ్యాస్ నిక్షేపాలను, రాగి నిక్షేపాలు ఉన్నాయి. పాకిస్థాన్ పూర్తిగా వీటిపైనే ఆధారపడుతూ అక్కడి ప్రజలను మాత్రం బానిసలుగా చూస్తూ వస్తుంది.