Brazil President Jair Bolsonaro (Photo-insta)

Rio de Janeiro, Mar 31: బ్రెజిల్‌ దేశాన్ని కరోనా వణికిస్తోంది. పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన్న‌ది. ఆ దేశ త్రివిధ ద‌ళాధిప‌తులు మూకుమ్మడి రాజీనామా చేశారు. కోవిడ్ నియంత్ర‌ణ‌లో అధ్య‌క్షుడు బొల్స‌నారో విఫ‌లం అయ్యారనే విమర్శల నేపథ్యంలో ర‌క్ష‌ణ మంత్రిని మార్చేందుకు అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిని వ్యతిరేకించిన త్రివిధ ద‌ళాధిప‌తులు తమ రాజీనామాలను (Brazil’s military chiefs all quit) సమర్పించారు. త్రివిధ ద‌ళాధిప‌తుల రాజీనామాను (Brazil’s armed forces) ర‌క్ష‌ణ మంత్రి ప్ర‌క‌టించారు.

అయితే రాజీనామా చేసిన వారి స్థానంలో కొత్త‌గా ఎవ‌ర్ని నియ‌మిస్తారో ఇంకా వెల్ల‌డించ‌లేదు. సైన్యంపై పూర్తి ఆధిప‌త్యాన్ని సాధించేందుకు బొల్స‌నారో (President Jair Bolsonaro) ఈ మార్పులు చేస్తున్న‌ట్లు విశ్లేష‌కులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.కాగా కోవిడ్‌ను నియంత్రించ‌డంలో బొల్స‌నారో దారుణంగా విఫ‌లమైన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బ్రెజిల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ‌ల్ల సుమారు 3.14 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. మంగ‌ళ‌వారం రోజు కొత్త‌గా సుమారు 4వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

రెండేళ్ల క్రితం అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన బొల్స‌నారో .. కోవిడ్ వేళ క్వారెంటైన్ ఆంక్ష‌ల‌ను వ్య‌తిరేకించారు. కోవిడ్ ఆంక్ష‌ల వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంద‌ని ఆరోపించారు. క‌రోనా గురించి ఆలోచించ వ‌ద్దు అంటూ ప్ర‌జ‌ల‌ను కోరారు. అయితే విదేశాంగ‌, ర‌క్ష‌ణ శాఖ మంత్రులు సోమ‌వారం రాజీనామా చేశారు. తాజాగా త్రివిధ ద‌ళాధిప‌తులు మూకుమ్మడి రాజీనామా చేశారు. దీంతో క్యాబినెట్‌ను మార్చాల‌ని బొల్స‌నారో నిర్ణ‌యించారు.

అధ్య‌క్షుడి వ్య‌వ‌హార శైలితో వ్య‌తిరేకించిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ద‌ళాధిప‌తులు.. ఒకేసారిగా రాజీనామా చేయ‌డం బ్రెజిల్ చ‌రిత్ర‌లో ఇదే మొద‌టిసారి. జ‌న‌ర‌ల్ ఎడ్స‌న్ లీల్ పుజోల్‌, అడ్మిర‌ల్ ఇల్‌క్వెస్ బార్బోసా, లెఫ్టినెంట్ బ్రిగేడియ‌ర్ ఆంటోనియో కార్లోస్ బెర్ముడేజ్‌లు మంగ‌ళవారం ఒకేసారి రాజీనామా చేశారు.అంత‌క‌ముందు విదేశాంగ మంత్రి ఆరుజో రాజీనామా చేశారు. చైనా, భార‌త్‌, అమెరికాతో స‌రైన సంబంధాల‌ను ఏర్ప‌ర్చుకోవ‌డంలో ఆరుజో విఫ‌ల‌మైన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్లు కావాల్సిన రీతిలో అంద‌లేద‌న్న విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బ్రెజిల్‌ పై కరోనా తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంది. దేశంలో రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తోంది. అందుకు గాను గత నెలలో బ్రెజిల్ ప్రభుత్వం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్జిన్ ను 20 మిలియన్ డోసులను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం రోజున కోవాక్జిన్‌ దాని తయారీ ప్రమాణాలకు అనుగుణంగా లేదని బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ అన్విసా ఆరోపించారు.

ఈ నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ బ్రెజిల్‌ భాగస్వామి ప్రెసిసా మెడికామెంటోస్ తో కలిసి ఒక ప్రకటనను విడుదల చేశారు. కోవాక్జిన్‌పై బ్రెజిల్‌ హెల్త్ రెగ్యులేటర్ చేసిన ప్రకటనలను సాక్షాధారాలతో నివృత్తి చేస్తామని తెలిపారు. వ్యాక్సిన్‌ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశామని అన్నారు. అంతేకాకుంగా కోవాక్జిన్‌ భారత్‌తో సహా ఐదు దేశాల్లో ఆమోదించారనే విషయాన్ని గుర్తుచేశారు. భారత్ బయోటెక్ మార్చి 8 న బ్రెజిల్లో టీకా అత్యవసర ఉపయోగం కోసం దరఖాస్తు చేసింది.

కాగా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా 918.08 మిలియన్ డాలర్లు కొత్త రుణాలను పంపిణీ చేయాలనే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మంగళవారం సంతకం చేశారు. కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలను బోల్సోనారో ఖండించారు. కొత్త రుణాలతో బ్రెజిల్ ఆరోగ్య వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని బ్రెజిల్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రియో ​​డి జనీరో రాష్ట్రంలో మంగళవారం రోజున తీవ్ర ఎండను సైతం లెక్క చేయకుండా బ్రెజిల్‌ పౌరులు టీకా కోసం ఆస్పత్రుల వద్ద బారులు తీరారు.