Beijing, August 9: ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి మరో షాకింగ్ వార్త చైనా నుంచి బయటకు వచ్చింది. చైనాలో ‘లాంగ్యా హెనిపా’ అనే కొత్త వైరస్ (China found a new zoonotic virus) వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ (Langya henipavirus) 35 మందికి సోకినట్లు తైవాన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) తెలిపింది.చైనాలోని షాంగ్‌డాంగ్, హెనాన్ ప్రావిన్సుల్లో వైరస్‌ను గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.కాగా జంతువుల నుంచి మనుషులకు ఇది వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
తైవాన్‌కు చెందిన సీడీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చువాంగ్ జెన్ సియాంగ్ మాట్లాడుతూ ఈ వైరస్ ఇప్పటివరకు ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. దీనిపై మరింత పరిశోధనలు జరుగుతున్నాయని, అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పెంపుడు జంతువులపై నిర్వహించిన సెరోలాజికల్ సర్వేలో మేకలు, కుక్కల రక్త నమూనాలను అధికారులు సేకరించి, పరీక్షించారు. దీంతో మేకల్లో 2 శాతం, కుక్కల్లో 5 శాతం వరకు వైరస్ పాజిటివ్ తేలింది. 27శాతం ఎలుకల్లో వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు.
చైనాలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి రక్త నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహించగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పరీక్షలు నిర్వహించగా 35 మందిలో లాంగ్యా హెనిపా వైరస్ పాజిటివ్‌గా తేలింది. అయితే, బాధితులు ఒకరికొకరికి సన్నహిత సంబంధాలు లేవని, వైరస్ ఇప్పటివరకు ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని సీడీసీ డిప్యూటీ డీజీ పేర్కొన్నారు.
వైరస్ సోకిన 26మందిలో రోగులు జ్వరం, అలసట, దగ్గు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పి, వికారం, తలనొప్పి, వాంతులు తదితర లక్షణాలున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోవడంతో పాటు లివర్, కిడ్నీలపై వైఫల్యం చెందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.