Moscow, August 17: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో దానికి విరుగుడును రష్యా (Coronavirus Russian Vaccine) కనిపెట్టి గ్లోబల్ వ్యాప్తంగా ఆశలు రేకెత్తించిన సంగతి విదితమే. అయితే దానికి సొంత దేశంలోనే ఎదురుదెబ్బ తగులుతోందని విషయాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ రూపొందించిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పై (Sputnik V) రష్యాలో సగం మంది డాక్టర్లు (Russian Doctors) నిరాసక్తత చూపిస్తున్నారట.
ఈ వ్యాక్సిన్‌ను మొదట తమ దేశంలోని ఆరోగ్య సిబ్బందికి, ఉపాధ్యాయులకు వేస్తామని ఆ దేశ అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అయితే, ఆ దేశంలోని సగం మందికంటే ఎక్కువ శాతం డాక్టర్లు ఈ టీకా తీసుకునేందుకు విముఖత చూపుతున్నారట. ఈ విషయం ఆర్‌బీసీ వెబ్‌సైట్ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో వెల్లడైంది. ప్రతి ఇద్దరు వైద్యుల్లో ఒకరు.. దాదాపు 52 శాతం మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదని తేలింది. కరోనాకి రష్యా వ్యాక్సిన్ చెక్, పుతిన్ కూతురుకి తొలి వ్యాక్సిన్, ప్రపంచంలోనే తొలి కోవిడ్-19 వైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని తెలిపిన రష్యా అధ్యక్షుడు
ఆర్‌బీసీ ప్రకారం, 3,000 మందికి పైగా ఆరోగ్య నిపుణులు పాల్గొన్న ఆన్‌లైన్ సర్వేలో కేవలం 24 శాతం మంది డాక్టర్లు మాత్రమే కొవిడ్-19 టీకా వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తేలింది. 52 శాతం మంది రష్యన్ వైద్యులు టీకా తీసుకోబోమని చెప్పారు. 66 శాతం మంది టీకా ప్రభావాన్ని రుజువు చేయడానికి తగినంత డేటా లేదని పేర్కొన్నారు. అయితే, 48 శాతం మంది దీనిని చాలా త్వరగా అభివృద్ధి చేశారని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ టీకా వేసుకోబోమని చెప్పిన 20 శాతం మంది వైద్యులు వారు ఇప్పటికీ రోగులు, సహచరులు, స్నేహితులకు స్పుత్నిక్ వీని సిఫారసు చేస్తున్నారని సర్వే కనుగొంది.