'COVID Can End in 2022': ఒమిక్రానే చివరి వేరియంట్ అనుకోవడం ప్రమాదకరం, కరోనా నుంచి ఈ ఏడాది చివర నాటికి విముక్తి పొందే అవకాశం, కీలక వ్యాఖ్యలు చేసిన డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్
WHO Chief Tedros Adhanom Ghebreyesus. (Photo Credits: IANS)

Geneva, January 25: కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే అంతమవుతుందన్న ఆలోచనలు సరికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ (WHO Chief Tedros Adhanom Ghebreyesus) సూచించారు. మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చే అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. డబ్ల్యూహెచ్ వో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒమిక్రాన్ ను గుర్తించిన 9 వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తు చేశారు.

కొత్త వేరియంట్ (New Variant) కేసుల సంఖ్య.. 2020లో నమోదైన మొత్తం కేసుల కన్నా ఎక్కువని చెప్పారు. గత వారం సగటున ప్రతి మూడు క్షణాలకు 100 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రతి 12 సెకన్లకు ఓ ప్రాణం కరోనాకు బలైందన్నారు. కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా.. మరణాలు మాత్రం అంతగా లేవని పేర్కొన్నారు. అయితే, వ్యాక్సిన్లు ఇంకా అందని ఆఫ్రికా వంటి దేశాల్లో మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తొమ్మిది వారాల కిందట ఒమిక్రాన్‌ వేరియెంట్‌ని (New COVID-19 Variant Omicron) గుర్తిస్తే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది వైరస్‌ బారిన పడినట్టు తమకు నివేదికలు అందాయన్నారు. 2020 ఏడాది మొత్తంగా నమోదైన కేసుల కంటే ఇది ఎక్కువని చెప్పారు.

వాట్ ఏ స్టుపిడ్ సన్ ఆఫ్ ఏ.. రిపోర్టపై నోరు పారేసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, తర్వాత ఫోన్ చేసి క్షమాపణలు చెప్పిన అమెరికా అధినేత

ఒమిక్రానే చివరి వేరియంట్ అని అనుకోవడం చాలా ప్రమాదకరమైన సంకేతమని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు.. కొత్త వేరియంట్లు ఉద్భవించేందుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. కరోనాను నియంత్రించాలంటే.. దాని తీవ్రతకు ఏర్పడిన పరిస్థితులను మార్చాలని సూచించారు. మహమ్మారి వైరస్ ఎప్పుడు..ఎలా మారుతోందో అంచనా వేయడం కష్టమని టెడ్రోస్ అన్నారు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పట్టాయని, అయితే, చాలా దేశాల్లో ఇంకా వేరియంట్ వ్యాప్తి ప్రబలంగానే ఉందని తెలిపారు.

కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లోనే కొత్త వేరియంట్లు ఉద్భవించే ముప్పుందని ఆయన హెచ్చరించారు. అయితే, సరైన చర్యలు తీసుకుంటే ఈ ఏడాదే మహమ్మారిని అంత్యదశకు తీసుకురావొచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు అన్ని దేశాలూ డబ్ల్యూహెచ్ వో వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని దేశాల్లో కరోనా పరీక్షలను పెంచాలని, వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆక్సిజన్, యాంటీ వైరల్ ఔషధాలను అందరికీ సమానంగా అందించాలన్నారు.

కరోనా కల్లోలం, మాస్కులు ధరించడం తప్పనిసరికాదని ప్రకటించిన యుకె ప్రధాని బోరిస్ జాన్సన్

ఇక ఈ ఏడాది కరోనా మహమ్మారి నుంచి విముక్తి (COVID Can End in 2022) పొందొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 12 సెకండ్లకు ఒకరు చనిపోతున్నప్పటికీ ఇది సాధ్యం అవుతుందని వివరించింది. వ్యాక్సినేషన్‌ ముమ్మరం, కరోనా నిబంధనలు పాటించడంతోనే ఇది సాధ్యమని పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికల్లా కోవిడ్‌–19 అత్యవసర పరిస్థితి నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా కృషి చేస్తే కరోనా తుది దశకు చేరుకుంటామన్నారు.