Washington, September 8: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కు టీకాను అభివృద్ధి చేయడానికి ప్రపంచ దేశాలు కృషిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి త్వరలోనే వ్యాక్సిన్ (Donald Trump on Covid Vaccine) వస్తుందని ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై మరోసారి ట్రంప్ స్పందిస్తూ... కొత్త వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు సాధారణంగా సంవత్సరాల తరబడి ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. తమ ప్రభుత్వం వందల బిలియన్ డాలర్లు ఖర్చుచేసి వ్యాక్సిన్ అభివృద్ధి చేసే యత్నాలను వేగవంతం చేసిందని చెప్పారు.
వచ్చే ఏడాది జనవరి నాటికి అమెరికాలో వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు 300 మిలియన్ల డోసులను సిద్ధం చేసేందుకు 'ఆపరేషన్ వార్ప్ స్పీడ్'' పేరుతో అమెరికా ఓ కార్యక్రమం ప్రారంభించిందని వివరించారు. కాగా, అక్టోబర్ కల్లా వ్యాక్సిన్ తీసుకొస్తామని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించగా అది అసాధ్యం కాదని అంటు వ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటొనీ ఫౌచీ, డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్ తెలిపిన విషయం తెలిసిందే. అమెరికా దేశంలో కోవిడ్ మీద మూడు వ్యాక్సిన్లు తయారీ దశలో ఉన్నాయి. ఇవి తుది దశకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కరోనా వ్యాక్సిన్ అక్టోబరులో అందుబాటులోకి రావొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న మాటలను తాను నమ్మనని డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఆదివారం అన్నారు. వ్యాక్సిన్స్ సమర్థత, పనితీరుపై విశ్వసనీయమైన సమాచారం ఉంటే తప్ప ట్రంప్ మాటలను నమ్మబోనన్నారు. అమెరికాలో కరోనా విజృంభణతో ఇప్పటిదాకా 1.91 లక్షల మందికి పైగా మరణించారు. 63 లక్షల మంది ఈ వైరస్ బారినపడ్డారు. నవంబరు 3న జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ట్రంప్ వ్యాక్సిన్‌పై ప్రకటనలు చేస్తున్నారని, తానేదో చేశానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కమల విమర్శించారు.