
Shanghai, Oct 13: చైనా మళ్లీ కరోనా కల్లోలాన్ని చూస్తోంది. దేశంలో ఒక్కసారిగా కోవిడ్ కేసులు (Coronavirus in China) పెరిగాయి. ప్రధాన ఆర్థిక నగరం షాంఘైలో మళ్లీ కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన మూడు నెలల్లో అత్యధిక స్థాయిలో నమోదు అయ్యాయి. దీంతో షాంఘై నగరంలో స్కూళ్లను (schools close) మూసివేశారు. బుధవారం రోజున సిటీలో 47 కొత్త ఇన్‌ఫెక్షన్లు (Shanghai Covid cases) నమోదు అయ్యాయి.
జూలై 13 తర్వాత అత్యధిక స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మరోవైపు బీజింగ్‌లో తాజాగా 18 కేసులు నమోదు అయ్యాయి. షాంఘైలోని అయిదు జిల్లాల్లో ఎంటర్‌టైన్మెంట్ వేదికలను మూసివేశారు. సినిమా హాల్స్, బార్లు, జిమ్‌లను కూడా క్లోజ్ చేశారు.
చైనాలో కొత్త Omicron సబ్-వేరియంట్‌లు BF.7 మరియు BA.5.1.7 కనుగొనబడ్డాయి. రెండు ఉప-వేరియంట్‌లు (Omicron strains) ఎక్కువ ట్రాన్స్‌మిసిబిలిటీతో అత్యంత ప్రమాదకర అంటువ్యాధిగా చెప్పబడ్డాయి. నమోదవుతున్న కేసులలో ఎక్కువగా కొత్త Omicron సబ్-వేరియంట్‌లకు సంబంధించిన కేసులు ఆపాదించబడ్డాయి. ఈ నేపథ్యంలో షాంగైతో పాటు చాలా రీజియన్లలో సోమవారం నుంచే కఠిన లాక్‌డౌన్‌ను మళ్లీ అమలు చేస్తున్నారు.
ఇక యూరప్ అంతటా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ బోర్డు ధ్రువీకరించింది. ‘కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మరో వేవ్ వస్తుందనటానికి ఇది నిదర్శనం’ అని డబ్ల్యూహెచ్‌వో యూరప్ డైరెక్టర్ హాన్స్ ఖ్లూజ్ తెలిపారు.