diwali-is-an-important-reminder-of-us-commitment-to-religious-liberty-donald-trump (Photo-Twitter)

Washington, October 26: తమ దేశంలో మత స్వాతంత్య్రానికి దీపావళి వేడుకలే నిదర్శనమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి, అఙ్ఞానంపై ఙ్ఞానం సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకొంటారని పేర్కొన్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న వెలుగుల పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు, బుద్ధిస్టులకు తనతో పాటు భార్య మెలానియా ట్రంప్‌ తరఫున కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. కాగా ఓవల్‌ కార్యాలయంలో కొంతమంది ఇండో అమెరికన్ల సమక్షంలో ట్రంప్‌ దీపావళి వేడుకలు నిర్వహించారు. అమెరికాలో దీపావళి జరుపుకుంటున్న ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘దీపావళి వేడుకలు మొదలవుతున్న సందర్భంగా... ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన ఈ పండుగను జరుపుకుంటున్న అందరికీ నేను, మిలానియా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

దివాళీ శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్

భారతీయులు ఆనందంగా జరుపుకొనే దీపావళి వేడుకలను అగ్రరాజ్యం అమెరికాలో ఈరోజు ఉత్సాహంగా జరుపుకొన్నారు. వైట్‌హౌస్‌ (శ్వేతసౌధం)లో జరిగిన వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొనడం గమనార్హం. దేశంలోని ప్రముఖ ప్రవాస భారతీయులు, శ్వేతసౌధం సిబ్బంది పాల్గొన్న వేడుకలతో అక్కడ సందడి నెలకొంది. పండుగ జరుపుకొంటున్న హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ అమెరికా దేశ ప్రధాన సిద్ధాంతాల్లో ఒకటైన మతస్వేచ్ఛకు దీపావళి వేడుకలు నిదర్శనమన్నారు. దేశంలోని అన్నిమతాల ప్రజలు తమ విశ్వాసాలకు అనుగుణంగా పండుగు జరుపుకొనే స్వేచ్ఛ అమెరికా కల్పిస్తోందని, వారి హక్కులను కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇక గత కొన్నేళ్లుగా అమెరికా శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అమెరికా రాజ్యాంగంలో ఉన్నట్లుగానే ఇక్కడి ప్రజలు తమ ఇష్ట దైవాలకు ప్రార్థనలు కానీ పూజలు కానీ చేసుకోవచ్చని అది వారి ఇష్టప్రకారం జరుగుతుందని ఫలానా మతాన్నే స్వీకరించాలని బలవంతం చేయబోమని ట్రంప్ పేర్కొన్నారు. వైట్‌హౌజ్‌లో దీపంను వెలిగించడం ద్వారా ట్రంప్ దీపావళి వేడుకలను ప్రారంభించారు.

ఇక దీపావళి పండగ సందర్భంగా వైట్‌హౌజ్‌ను దీపాలతో అలంకరిస్తారనే ప్రచారం జరుగుతోంది. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దీపావళి వేడుకల్లో పాల్గొనడం ఇది మూడోసారి కావడం విశేషం. ఇక ఒబామా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వైట్‌హౌజ్‌లో దీపావళి వేడుకలు సంప్రదాయంగా జరుపుతున్నారు.