PM Modi meets Donald Trump at G7 Summit.

France, August 26:  ఫ్రాన్స్‌లో జరుగుతున్న G7 దేశాల సదస్సు (G7 Summit) సందర్భంగా సోమవారం రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా- భారత్ దేశాలకు సంబంధించిన అనేక అంశాలు చర్చకు వచ్చాయి. అలాగే ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తరువాత కాశ్మీర్‌లో నెలకొన్న అశాంతికి సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చింది.  తర్వాత ఇరువురు కలిసి సంయుక్తగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి చర్చలకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

కాశ్మీర్‌లో పరిస్థితి అంతా సాధరణంగానే ఉంది, శాంతి భద్రతలు తమ అదుపులోనే ఉన్నాయని మోదీ తనతో చెప్పినట్లు ట్రంప్ మీడియాకు వివరించారు. కాశ్మీర్ అనేది ద్వైపాక్షిక అంశం, ఇండియా మరియు పాకిస్థాన్ ఇరు దేశాలు చర్చించుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపుతాయని ట్రంప్ ఆకాంక్షించారు.

 

 

ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ కల్పించుకొని 'భారత్- పాకిస్థాన్ మధ్య జరిగే ఏ అంశమైనా అది ద్వైపాక్షికమే. అందువల్లే ఈ అంశాల పట్ల ఇతర దేశాలను ఇబ్బంది పెట్టొద్దని మేము భావిస్తున్నాం.' అని చెప్పుకొచ్చారు.

ట్రంప్‌ను పక్కనే ఉంచుకొని జీ7 సదస్సు సాక్షిగా ప్రధాని మోదీ కాశ్మీర్ అంశం 'ద్వైపాక్షికం' చెప్పడం, ట్రంప్‌తో కూడా చెప్పించడంలో సక్సెస్ అవ్వడంతో కాశ్మీర్ అంశం పట్ల దౌత్య పరంగా భారత్‌పై చేయి సాధించినట్లయింది. అంటే ప్రపంచ దేశాల సాక్షిగా చెప్పినట్లయింది.

అయితే గతంలో రెండు సార్లు అవసరమైతే కాశ్మీర్ అంశంలో ఇండియా- పాకిస్థాన్ దేశాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తాను అని చెప్పిన ట్రంప్, తాజాగా ద్వైపాక్షిక అంశం అని మరోసారి వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.

ట్రంప్ మధ్యవర్తిత్వం చేయాలని ఒకవైపు పాకిస్థాన్ పట్టుబడుతుండగా, భారత్ మాత్రం తాము చూసుకుంటాం అని చెబుతుండటంతోనే ట్రంప్ ఈ డబుల్ స్టాండర్డ్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. 'ఇద్దరికీ అవసరం అనుకుంటేనే తాను మధ్యవర్తిత్వం వహించేందుకు ఎప్పుడు సిద్ధమే' అని ట్రంప్ చెప్పినట్లుగా కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉండగా, ట్రంప్ - మోదీ మధ్య ఇరుదేశాలకు సంబంధించిన వాణిజ్య అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ చర్చలు ఫలవంతమైనట్లు మోదీ వివరించారు. రాబోయే కాలంలో అమెరికా- భారత్ దేశాల మధ్య మంచి వాణిజ్య సంబంధాలు నెలకొంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో శాంతి మరియు సంక్షేమం కోసం అమెరికా - భారత్ దేశాలు కలిసి పనిచేస్తాయని మోదీ పేర్కొన్నారు.