'Tik Tok Ban in US': అమెరికాలోనూ టిక్ టాక్‌పై నిషేధాన్ని పరిశీలిస్తున్నామన్న డొనాల్డ్ ట్రంప్, తమ వద్ద మరికొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయని వెల్లడి,  మెక్రోసాఫ్ట్ కొనుగోలు చేస్తుందని ఊహాగానాలు
US President Donald Trump (Photo Credits: IANS)

Washington D.C, August 1: ఇప్పటికే భారత్ లో నిషేధాన్ని ఎదుర్కొంటున్న టిక్ టాక్ లాంటి చైనీస్ యాప్స్ పై అమెరికా కూడా చర్యలకు సిద్ధమవుతున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. జాతీయ భద్రత మరియు సెన్సార్‌షిప్ తదితర కారణాల దృష్ట్యా చైనాకు చెందిన ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌పై పాలనపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు ట్రంప్ శుక్రవారం పేర్కొన్నారు.

"మేము టిటిక్‌టాక్‌ను పరిశీలిస్తున్నాము, ఆ యాప్ ను నిషేధించవచ్చు, లేదా ఇంకే రకమైన చర్యలు తీసుకోవచ్చు. మా దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లోలోపల చాలా జరుగుతుంది, చివరగా ఏమవుతుందో చూద్దాం" అని డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వద్ద విలేకరులతో అన్నారు.

టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీలకు విక్రయించాల్సిందిగా దాని సంస్థ బైట్‌డాన్స్‌ను ఆదేశించేందుకు డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గం సిద్ధమవుతోందని ప్రముఖ మీడియా సంస్థలు న్యూయార్క్ టైమ్స్ మరియు ఫాక్స్ బిజినెస్ కథనాలు వెలువరించాయి. చైనీస్ యాజమాన్య హక్కులు ఉపసంహరించుకునేలా బైట్‌డాన్స్‌ను ఆదేశించే నిర్ణయాన్ని ట్రంప్ పరిపాలన విభాగం త్వరలో ప్రకటించవచ్చని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ మరియు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించాయి.

ఈ యాప్‌ను కొనుగోలు చేయడానికి సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్నట్లు శుక్రవారం వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ట్రంప్ కూడా టిక్‌టాక్‌పై వ్యాఖ్యలు చేయడం ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్ మాత్రం దీనిపై స్పందించడానికి నిరాకరించింది.

మరోవైపు, టిక్‌టాక్ శుక్రవారం మరో విధమైన ప్రకటన విడుదల చేసింది, "మేము పుకార్లపై, ఊహాగానాలపై వ్యాఖ్యానించబోము, మా విజయంపై మాకు నమ్మకం ఉంది." అని టిక్‌టాక్ పేర్కొంది.

బైట్‌డాన్స్ అనే చైనీస్ సంస్థ 2017 లో టిక్‌టాక్‌ను ప్రారంభించింది. యూఎస్ మరియు యూరప్‌లో విశేషమైన ప్రాచుర్యం కలిగిన 'మ్యూజికల్లీ' అనే వీడియో యాప్ ను కొనుగోలు చేసి ఆ తర్వాత యాప్ లో అంతర్గతంగా పలు రకాల మార్పులు చేసి ఇండియా సహా అనేక దేశాలలోని యువతకు ఈ యాప్ మరింత చేరువైంది.

అయితే, కొన్ని రోజుల క్రితం ఇండియా- చైనా సరిహద్దు వద్ద చైనా సైన్యం హద్దులు మీరడంతో దేశ భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం తమ దేశంలో చైనీస్ యాప్స్ పై నిషేధం విధించింది. పబ్‌జీ సహా మరికొన్ని  చైనా ఆధారిత యాప్‌ల‌పై నిషేధం దిశగా భారత్ అడుగులు

ఇప్పటికే కరోనా పుట్టుకకు కారణమైన చైనాపై అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనీస్ యాప్స్ పై భారత్ విధించిన నిషేధాన్ని అమెరికా సమర్థించింది. చైనా ఇంటెలిజెన్స్‌కు టిక్‌టాక్ ఒక సాధనంగా ఉపయోగపడవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న అగ్రరాజ్యం, ఇప్పుడు టిక్‌టాక్ సహా మరిన్ని చైనా యాప్స్ పై చర్యలు తీసుకునేందుకు భారత్ మార్గాన్నే అనుసరించనున్నట్లు సమాచారం.