Trump Thanks PM Modi: 'మీ బలమైన నాయకత్వం, మానవత్వానికి సహాపడుతుంది'. ప్రధాని నరేంద్ర మోదీపై యూఎస్ ప్రెసిడెంట్ ప్రశంసలు, హైడ్రోక్లోరోక్విన్ ఎగుమతిపై ధన్యవాదాలు తెలిపిన ట్రంప్
PM Modi with Donald Trump | File Image | (Photo Credits: Getty Images)

Washington, April 8:  'పెడితే పెళ్లి కోరతా, లేకపోతే చావు కోరతా' అన్నట్లుంది ట్రంప్ వ్యవహారం. యూఎస్ఎకు హైడ్రాక్సీక్లోరోక్విన్ (Hydroxychloroquine ) ఎగుమతిని అనుమతించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనావైరస్ మహమ్మారిపై (COVID 19 Pandemic) చేస్తున్న యుద్ధంలో భారత ప్రధాని మోదీ (PM Narendra Modi) ఆదర్శవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించారంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

అంతకుముందు ఇదే ట్రంప్ మాట్లాడుతూ అమెరికాకు హెచ్‌సిక్యూ లేదా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతిని అనుమతించాలన్న తన అభ్యర్థనను మోదీ ఆమోదించకపోతే అందుకు ఖచ్చితంగా "ప్రతీకారం తీర్చుకుంటాం" అంటూ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. భారత్- యూఎస్ మధ్య సత్సంబధాలు కొనసాగుతాయని ఆశిస్తున్నాం అంటూ డొనాల్డ్ ట్రంప్ ఒక రకమైన హెచ్చరికల లాంటి ప్రకటనలు చేశారు. కోవిడ్-19 వల్ల ఇరుదేశాల్లో గల పరిస్థితులపై భారత ప్రధానితో టెలిఫోనిక్ సంభాషణ జరిపిన ఒక రోజు తర్వాత అమెరికా అధ్యక్షుడి నుంచి ఇలాంటి కఠినమైన హెచ్చరికలు వచ్చాయి.

మన దేశంలో కూడా కరోనావైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణకు ఉపయోగపడే కొన్ని కీలక ఔషధాల ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. ప్రస్తుతం కోవిడ్-19కు వ్యాక్సిన్ లేనప్పటికీ చికిత్సలో మాత్రం హైడ్రోక్లోరోక్విన్, పారాసిటమాల్ లాంటి ఔషధాలు కరోనావైరస్ పై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. ఈ మందులు భారత్ లో ఎప్పుడూ విరివిగా లభించేవే, మనదేశంలోని ఫార్మా సంస్థలు కూడా వీటిని పెద్ద మొత్తంలో తయారు చేస్తాయి. దీంతో యూఎస్ సహా ప్రపంచంలోని మరో 30 దేశాల కన్ను భారత్ పై పడింది. తమకు ఈ ఔషధాలు కావాలని డిమాండ్లు పెరిగాయి. ఇదే క్రమంలో యూఎస్ ప్రెసిడెంట్ ఒకడుగు ముందుకేసి హెచ్చరికలు చేసే వరకు వచ్చారు.  కరోనావైరస్ మహమ్మారిపై చేసే పోరాటంలో హైడ్రాక్సీక్లోరోక్విన్-అజిథ్రోమైసిన్ డ్రగ్స్ కలయిక గేమ్ ఛేంజర్- డొనాల్డ్ ట్రంప్

అయితే, ఈ అంశంపై చర్చించిన కేంద్ర కేబినేట్ వివిధ దేశాలతో మన అవసరాలు ఎలా ఉన్నాయో పరిగణలోకి తీసుకొని, దేశ అవసరాల కోసం 25 శాతం నిలువ ఉంచుకొని, మిగతా మొత్తాన్ని అమెరికాకు మరియు భారత్ పై ఆధారపడే మరికొన్ని దేశాలకు 'మానవతా కోణంలో' అందించడానికి నిర్ణయించింది. నిషేధం విధించిన ఔషధ ఉత్పత్తుల జాబితా నుంచి హెచ్‌సిక్యూని తొలగించింది.

భారత్ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ట్రంప్ స్పందించారు. "అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య మరింత పరస్పర సహకారం అవసరం. హెచ్‌సిక్యూపై నిర్ణయం తీసుకున్నందుకు భారత్‌కు, భారతీయ ప్రజలకు ధన్యవాదాలు. మీ సహకారాన్ని మర్చిపోలేము! ఈ పోరాటంలో భారతదేశానికి మాత్రమే కాకుండా, మానవత్వానికి సహాయం చేయడంలో ప్రదర్శించిన బలమైన నాయకత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు! ”అని ట్రంప్ పేర్కొన్నారు.

Trump Thanks Modi For Approving HCQ Export

కాగా, ట్రంప్ 'ప్రతీకార' వ్యాఖ్యలపై నేరుగా స్పందించని భారత్, ప్రపంచ ఔషధ ఎగుమతులను 'రాజకీయం' చేయరాదంటూ పరోక్ష ప్రకటన చేసింది.

అలాగే, భారత్ లో ఔషధాల నిల్వపై మీడియా అనవసర వివాదాలు సృష్టించవద్దని, ఒక బాధ్యాతాయుత ప్రభుత్వం తన ప్రజల అవసరాల కోసం తగినంత నిల్వ ఉందని నిర్ధారించుకున్నాకే ఎగుమతుల ఆంక్షలు సడలిస్తూ కొన్ని తాత్కాలిక అనుమలు ఇచ్చిందని MEA అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.