Gaza, NOV 01: గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన దాడిలో హమాస్ (Hamas Attack) కమాండర్ తోపాటు పలువురు ఉగ్రవాదులు హతం అయ్యారని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ ఉగ్రవాదులు దాక్కున్న టన్నెళ్లను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పేల్చివేసింది. ఐడీఎఫ్ (IDF) జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ సెంట్రల్ జబాలియా బెటాలియన్ కమాండర్ ఇబ్రహీం బియారీ మరణించాడని ఇజ్రాయెల్ తెలిపింది. అక్టోబర్ 7 దాడికి కారణమైన హమాస్ సీనియర్ కమాండర్‌ను తమ ఫైటర్ జెట్‌లు హతమార్చాయని ఐడీఎఫ్ తెలిపింది. గాజాలో ఉగ్రవాదులు దాక్కున్న టన్నెళ్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వైమానిక దాడుల్లో కమాండర్ బియారీతోపాటు 50 మంది పాలస్తీనియన్లు మరణించారు. డజన్ల కొద్దీ హమాస్ ఉగ్రవాదులు బియారీ మాదిరిగానే భూగర్భ సొరంగం కాంప్లెక్స్‌లో ఉండగా తాము దాడి చేసి హతమార్చామని ఐడీఎఫ్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ జోనాథన్ కాన్రికస్ చెప్పారు. గాజా స్ట్రిప్‌లోని అతిపెద్ద శరణార్థి శిబిరంలో (Largest Refugee Camp) కనీసం 50 మంది పాలస్తీనియన్లు మరణించారని, 150 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించామని యెమెన్ హౌతీలు ప్రకటించారు. తాము మంగళవారం ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో (Hamas Attack) చేరినట్లు వారు పేర్కొన్నారు. తాము ఇజ్రాయెల్‌పై మరిన్ని దాడులు చేస్తాయని హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సారీ హెచ్చరించారు. గాజాలో మానవత్వానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ నేరాలకు పాల్పడిందని బొలీవియా మంగళవారం ఆరోపించింది. కొలంబియా, చిలీ దేశాలు కూడా ఇజ్రాయెల్‌లోని తమ రాయబారులను వెనక్కి పిలుస్తున్నట్లు ప్రకటించాయి.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తీవ్రతరం అయింది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో మొత్తం 10వేల మంది మరణించారని హమాస్ తెలిపింది.అల్ షిఫా మెడికల్ కాంప్లెక్స్ మరియు ఇండోనేషియా హాస్పిటల్‌లోని పవర్ జనరేటర్లు ఇంధన కొరత కారణంగా పనిచేయడం లేదు.దీంతో గాయపడిన వారికి చికిత్స అందించడం కష్టతరంగా మారింది. కాగా రాబోయే రోజుల్లో కొంతమంది విదేశీ బందీలను విడుదల చేస్తామని హమాస్ మధ్యవర్తులకు సూచించింది.