Horse Found Alive Under Building Rubble (PIC @ Screen garb from Viral video)

Turkey, March 01: భారీ భూకంపం టర్కీని (Turkey) అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. బలమైన భూకంపం (Earthquake) ధాటికి టర్కీ కకావికలమైపోయింది. భూకంపం వేలాది మందిని బలి తీసుకుంది. పెద్ద సంఖ్యలో భనవాలు కుప్పకూలాయి. ఈ ఘోర విపత్తులో శిథిలాల కింద వేలాది చిక్కుకుని చనిపోయారు. కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కొన్ని రోజుల పాటు ఎలాంటి ఆహారం, నీరు లేకున్నా మృత్యుంజయులుగా బయటకు వచ్చారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా మరో అద్భుతం జరిగింది. దీన్ని మిరాకిల్ అనొచ్చు. శిథిలాల కింద 21 రోజుల పాటు చిక్కుకుని.. ప్రాణాలతో బతికిందో గుర్రం. అడియామన్ ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలగా.. శిథిలాల కింద గుర్రం (Horse Found Alive) చిక్కుకుంది. రెస్క్యూ సిబ్బంది శిథిలాలు తొలగిస్తుండగా.. గుర్రం వారి కంట పడింది. అదింకా ప్రాణాలతో ఉండటం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే వారు గురాన్ని కాపాడారు. శిథిలాల కింద ప్రాణంతో ఉన్న గుర్రాన్ని రెస్క్యూ బృందాలు కాపాడాయి. క్షేమంగా దాన్ని బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి అంతా నివ్వెరపోతున్నారు.

నిజంగా ఇదో ప్రపంచ అద్భుతం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫిబ్రవరి 6న దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ప్రకృతి విలయ తాండవం కారణంగా టర్కీ, సిరియా దేశాల్లో అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. 50వేల మందికి పైగా మృతి చెందారు. దీంతోపాటు ఈ ప్రమాదంలో ఇప్పటివరకు సుమారు 1,73,000 భవనాలు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరి 6 నుంచి ఇప్పటివరకు భూకంప ప్రభావిత ప్రాంతాలలో దాదాపు 10వేల ప్రకంపనలు సంభవించాయి. దీంతో దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.