California, July 22: మూడేళ్లు ప్రపంచాన్ని కరోనా (Corona) అతలాకుతలం చేసింది. ఇప్పుడు కాస్త శాంతించింది. అక్కడక్కడా కొవిడ్-19 (Covid -19) కేసులు వెలుగు చూస్తున్నా ప్రాణాంతకంగా మారడం లేదు. అయితే, ఇప్పుడు ప్రపంచాన్ని మంకీపాక్స్ (monkey pox) కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మంకీపాక్స్ (monkey pox) విస్తరించింది. ఇండియాలోనూ మూడు కేసులు వెలుగుచూశాయి. కాగా, అమెరికాలో అరుదైన సంఘటన జరిగింది. ఒకే వ్యక్తికి ఏకకాలంలో మంకీపాక్స్, కరోనా వైరస్ సోకాయి. మిట్చో థాంప్సన్‌కు (Thompson) కరోనా పాజిటివ్‌గా తేలింది. అదే సమయంలో అతడి శరీరంపై ఎర్రని దద్దుర్లు కనిపించాయి. పరీక్షలు చేయించుకోగా మంకీపాక్స్ అని తేలింది. అతడికి ఏకకాలంలో మంకీపాక్స్, కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు కూడా నిర్ధారించారు. ఈ రెండు వైరస్‌ల వల్ల అతడు వారాలపాటు మంచానికే పరిమితమయ్యాడు. ఇది అరుదైన కేసుగా వైద్యులు అభివర్ణించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర కమిటీ గురువారం సమావేశమై మంకీపాక్స్‌ను ప్రపంచ సంక్షోభంగా ప్రకటించాలా? వద్దా? అనే విషయాన్ని వారాల వ్యవధిలో రెండోసారి పరిశీలించిన మరుసటి రోజే ఈ ఘటన వెలుగుచూసింది. కాగా, మంకీపాక్స్ వైరస్ కనీసం 95 శాతం కేసుల్లో లైంగిక కార్యకలాపాల ద్వారా వ్యాపించిందని తాజా పరిశోధనలో తేలింది.