
New Delhi, January 1: దాయాది దేశం వాయవ్య పాకిస్థాన్‌లో ఓ హిందూ దేవాలయాన్ని దుండుగులు ధ్వంసం (Hindu Temple’s Demolition in Pak) చేశారు. దీనిపై భారత ప్రభుత్వం శుక్రవారం తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ ప్రభుత్వానికి దౌత్య మార్గాల్లో తీవ్ర నిరసన తెలిపింది. ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన కథనం ప్రకారం, పాకిస్థాన్‌లోని కైబర్ పక్తూన్‌క్వాలోని, కరక్ జిల్లా, తేరి గ్రామంలో బుధవారం శ్రీ పరమహంసజీ మహరాజ్ సమాధిని (Shri Paramhans Ji Maharaj’s Samadhi), కృష్ణ ద్వార మందిరాన్ని (Krishna Dwara Mandir) ముస్లిం మత సంస్థల ఆధ్వర్యంలో స్థానిక ముస్లింలు ధ్వంసం చేశారు.
అక్కడ హిందూ దేవాలయాన్ని తగులబెట్టి, పెను విద్వంసం సృష్టించడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ ప్రభుత్వానికి అధికారికంగా నిరసన తెలిపింది. దాదాపు 1,500 మంది ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై మానవ హక్కుల సంఘాలు, హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. మరోవైపు పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్‌కు ఈ సంఘటన గురించి ఆ దేశంలోని మైనారిటీ ప్రజా ప్రతినిధి రమేశ్ కుమార్ తెలియజేశారు. జనవరి 5న దీనిపై విచారణ జరిపేందుకు పాక్ సుప్రీంకోర్టు (Pakistan's Supreme Court) అంగీకరించింది.
కాగా పాకిస్థాన్ మత వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్ హక్ ఖాద్రి (Noorul Haq Qadr) దీనిపై స్పందిస్తూ, వర్గ సామరస్యానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, మైనారిటీల మత స్వేచ్ఛను పరిరక్షించడం పాకిస్థాన్‌కు మత, రాజ్యాంగ, నైతిక, జాతీయ బాధ్యత అని పేర్కొన్నారు.
తేరి గ్రామంలోని ప్రార్థనా స్థలంపై జరిగిన దాడిపై దేశ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ గురువారం సుమో మోటు నోటీసు తీసుకున్న తరువాత ఈ అరెస్టులు జరిగాయి. ఇదిలా ఉంటే తేరి గ్రామంలో ప్రార్థనా స్థలాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ కరాచీ నగరంలో డజన్ల కొద్దీ హిందువులు ర్యాలీ చేసినట్లు సమాచారం.
ఈ ఆలయం మొట్టమొదట 1997 లో దాడి చేయబడి కూల్చివేయబడింది. అయితే 2015 లో సుప్రీంకోర్టు జోక్యం తరువాత స్థానిక సమాజం దాని పునర్నిర్మాణానికి అంగీకరించింది. ఆలయం పునర్నిర్మాణ సమయంలో కేటాయించిన భూమిపై అక్కడ వివాదం ఉంది, దీనివల్ల ఆలయ నిర్మాణంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. ఇక మతాధికారుల మండలి సిఫారసు మేరకు ఇస్లామాబాద్‌లో హిందూ నివాసితులకు కొత్త ఆలయాన్ని నిర్మించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతించిన కొన్ని వారాల తరువాత ఈ దాడి జరిగింది.