coronavirus in idnia (Photo-PTI)

New Delhi, August 4: భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (Covid 19 in india) 18 లక్షల 50 వేలు దాటాయి. గడచిన 24 గంటలలో అత్యధికంగా 52,050 కరోనా పాజిటివ్ కేసులు (India Coronavirus) నమోదయ్యాయి. 24 గంటల్లో దేశంలో కరోనా (COVID-19) కారణంగా మొత్తం 803 మంది మృతిచెందారు. దేశ వ్యాప్తంగా 44,306 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇదిలావుండగా దేశంలో ఇప్పటివరకు 18,55,745 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం కరోనా వైరస్‌కు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. నేటి నుంచి యోగా సెంటర్లు, జిమ్‌లు ఓపెన్, పాటించాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం, మాస్క్‌ తప్పనిసరి

దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 5,86,298గా ఉన్నాయి. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12,30,509 గా ఉంది. ఇక కరోనా కారణంగా దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 38,938 కు చేరుకుంది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 66.31గా ఉంది. దేశంలో గడచిన 24 గంటలలో 6,61,892 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా ఇప్పటి వరకు దేశంలో మొత్తం 2,08,64,750 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు.

కర్ణాటకలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కరోనా బారిన పడగా, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్షనేత మాజీ సీఎం సిద్ధరామయ్య (71) కు కరోనా సోకింది. ఈ విషయీన్ని సిద్ధరామయ్య ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, స్వల్ప లక్షణాలున్నప్పటికీ వైద్యుల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరానని ప్రకటించారు. అలాగే తనతో సన్నిహితంగా మెలిగినవారు అప్రమత్తం కావాలని, స్వీయ నిర్బంధం పాటించాలని ట్వీట్‌ చేశారు. సిద్దరామయ్య ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఇదే ఆసుపత్రిలో సీఎం యడ్యూరప్ప కూడా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

ఇక తమ కుటుంబ స‌భ్యుల్లో ఇద్ద‌రికి క‌రోనా సోక‌డంతో తాను స్వీయ నిర్భంధంలోకి వెళ్తున్న‌ట్లు త్రిపుర సీఎం బిప్లాబ్ కుమార్ డెబ్ తెలిపారు. త‌నకు నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్షా ఫ‌లితాలు ఇంకా వెలువ‌డ‌లేద‌ని దీంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా హోం ఐసోలేష‌న్‌లోకి వెళుతున్న‌ట్లు వెల్ల‌డించారు. అన్ని జాగ్ర‌త్తలు తీసుకుంటున్నాన‌ని పేర్కొన్న బిప్లాబ్ కుమార్ డెబ్.. కుటుంబ‌స‌భ్యుల ఆరోగ్యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ సీఎం ట్వీట్ చేశారు.

గత 24 గంటల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం 6.6లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించడం ద్వారా భారత్ ఒకే రోజు అత్యధిక పరీక్షలను నమోదు చేసిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కోవిడ్-19కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారతదేశం గత 24 గంటల్లో 6,61,715 పరీక్షలను చేసిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 2,08,64,206 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

గడ‌చిన‌ 24 గంటల్లో బ్రెజిల్‌లో కరోనా వైరస్ కారణంగా 541 మంది మృతి చెందారు. దీంతో బ్రెజిల్‌లో మొత్తం క‌రోనా మరణాల సంఖ్య 94,702 కు పెరిగింది. వరల్డ్‌మీటర్ తెలిపిన వివ‌రాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 17,988 కేసులు నమోదయ్యాయి. దీంతో క‌రోనా సోకిన వారి సంఖ్య మొత్తంగా 27,51,665కు చేరుకుంది.

జర్మనీలో కొత్తగా 509 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ గత 24 గంటల్లో నిర్ధారిత‌మ‌య్యాయి. జ‌ర్మ‌నీలో క‌రోనా ‌సోకిన వారి సంఖ్య 2,12,320కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 1,84,33,961గా ఉన్నాయి. బ్రిటన్‌లో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 928 మందికి క‌రోనా సోకింది. దీంతో దేశంలో క‌రోనా సోకిన‌వారి సంఖ్య 3,05,623 కు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 46,210గా న‌మోద‌య్యింది.

చైనాలో గడచిన 24 గంటల్లో కొత్తగా 36 మందికి కరోనా సోకిందని చైనా జాతీయ కమిషన్ మంగళవారం వెల్లడించింది. 30 కేసులు స్థానికంగా వెలుగుచూడగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఆరుగురికి కరోనా వైరస్ సోకిందని చైనా తెలిపింది. జింగ్ జియాంగ్ ప్రావిన్సులో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయని చైనా వైద్యాధికారులు చెప్పారు. చైనా దేశంలో మొత్తం 84,464 మందికి కరోనా సోకగా, వారిలో 4,634 మంది మరణించారు.