Tharman Shanmugaratnam (PIC@ X)

Singapore, SEP 01: సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి ధర్మాన్‌ షణ్ముగరత్నం ( Tharman Shanmugaratnam ) (66) చరిత్ర సృష్టించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇద్దరు చైనా సంతతికి చెందిన అభ్యర్థులపై భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఈ ఎన్నికల్లో షణ్ముగరత్నానికి 70.4 శాతం ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థులు కోక్‌ సోంగ్‌కు 15.7 శాతం, టాన్‌ కిన్‌ లియన్‌కు 13.88 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ విషయాన్ని ఆ దేశ ఎన్నికల కమిటీ ధ్రువీకరించింది. గతంలో భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు సింగపూర్‌ అధ్యక్షులుగా పనిచేశారు. కేరళకు చెందిన దేవన్‌ నాయర్‌ 1981లో సింగపూర్‌ అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 1985 వరకు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన సెల్లపన్‌ రామనాథన్‌ 2009లో సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు భారత సంతతికి చెందిన మూడో అధ్యక్షుడిగా ధర్మాన్‌ షణ్ముగరత్నం ఎంపికయ్యారు.

సింగపూర్‌లో జన్మించిన భారత సంతతికి చెందిన ధర్మాన్‌ షణ్ముగరత్నం 2001లో రాజకీయాల్లోకి వచ్చారు. పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ నుంచి రెండు దశాబ్దాలకు పైగా వివిధ మంత్రి పదవుల్లో పనిచేశారు. 2011 నుంచి 2019 మధ్య సింగపూర్‌ ఉప ప్రధానిగా పనిచేశారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఈ ఏడాది జూలైలో ప్రజా, రాజకీయ పదవులకు రాజీనామా చేశారు.