
New Delhi, November 2: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్థాన్‌లో కశ్మీర్ సమస్య కంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే ప్రజలను ఎక్కువగా కలవరపెడుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. పాకిస్తాన్ ప్రజలను పట్టి పీడిస్తోంది ద్రవ్యోల్బణమే తప్ప కశ్మీర్ సమస్య కాదని గల్లప్ ఇంటర్నేషనల్ నిర్వహించిన తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. పాకిస్తాన్‌లో గల్లప్ అండ్ గిలానీ ప్రచురించిన ఈ అధ్యయనంలో ప్రతిస్పందించిన వారిలో 53 శాతం మంది దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం (23 శాతం), అవినీతి (4 శాతం), నీటి సంక్షోభం (4 శాతం) ప్రధాన సవాళ్లని వారు పేర్కొన్నారు. పాక్‌లోని బలూచిస్థాన్, ఖైబర్, ఫఖ్తన్‌ఖ్వా, పంజాబ్-సింధ్ రాష్ర్టాల్లో గ్యాలప్ ఇంటర్నేషనల్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
అయితే పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తున్నట్టు కశ్మీర్ సమస్య తీవ్రమైన సమస్య అని అక్కడి ప్రజలు అనుకోవడంలేదని పేర్కొంది. ప్రజల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే కశ్మీర్ అంశం దేశానికి తీవ్రమైన విషయమని అభిప్రాయ పడుతున్నారని సర్వే తెలిపింది.కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజలు నమ్మకపోవడం ఆసక్తి కలిగించి అంశంలా మారింది. దేశంలో రాజకీయ అస్థిరత, అధికార సంక్షోభం,డెంగీపై ప్రజలు భయాందోళనలు వ్యక్తంచేశారు.
కొన్నేళ్లుగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నది. బలహీన, అసమతుల్యవృద్ధితో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నదని, దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని గత జూలైలో ఐఎంఎఫ్ సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. పాక్ కఠిన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని సూచించింది. పాక్‌కు ఈ ఏడాది 600 కోట్ల డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీని ప్రకటించింది. ఖతార్, చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా పాక్ బెయిలవుట్ ప్యాకేజీ పొందింది.