Ireland (Photo-Wikimedia)

యూరప్ దేశం ఐర్లాండ్ తమ దేశంలో స్థిరపడాలనుకునే వారికి బంపరాఫర్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చి స్థిరపడితే రూ.71 లక్షలతో (Irish government Will Pay You Rs 71 Lakh) పాటు..ఆ దేశానికి వెళ్లిన వాళ్లకు రిలోకేషన్‌ డబ్బులు ఇవ్వడమే కాకుండా ఉద్యోగం కూడా వెతికిపెడతామని తెలిపింది. ఏదైనా స్టార్టప్‌ పెట్టాలనే ఆలోచన ఉంటే డబ్బులు కూడా పెట్టుబడి పెడతామని ప్రకటించింది.

ఈ ఆఫర్ వెనుక కథను తెలుసుకోవాలంటే ఐర్లాండ్ జనాభా (Ireland papulation) గురించి తెలుసుకోవాల్సిందే.. కొంతకాలంగా ఐర్లాండ్‌లో జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. కొన్ని దీవుల్లో కేవలం 160 మంది జనాభా మాత్రమే ఉంది. ఈ పరిస్థితిని చూసి ఆందోళన చెందిన ఐర్లాండ్‌ ప్రభుత్వం జనాభా పెంచుకునేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.

అవర్‌ లీవింగ్‌ ఐలాండ్స్‌ ( Our Living Islands ) పాలసీలో భాగంగా తమ దేశంలోని దీవుల్లో సెటిల్‌ అయ్యే వాళ్లకు భారీగా పారితోషికం ఇవ్వాలని నిర్ణయించింది. తమ దేశానికి వచ్చి స్థిరపడేవారికి 80 వేల యూరోలు అందజేస్తామని ప్రభుత్వ అధికార వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఇది భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.71 లక్షలు. ఐర్లాండ్‌లోని దాదాపు 90 దీవుల్లో ఈ ఆఫర్‌ వర్తిస్తుందని కూడా పేర్కొంది.

అక్రమ సంబంధం పెట్టుకుంటే ఉద్యోగం ఊస్ట్, భార్యకు విడాకులు ఇచ్చినా ఉద్యోగం నుంచి తీసేస్తామంటూ కంపెనీ ప్రకటన, చైనాలో ఉద్యోగుల కోసం సరికొత్త రూల్ తెచ్చిన సంస్థ

ఇదిలా ఉంటే ఈ ఆఫర్ ద్వారా ఐర్లాండ్ దేశానికి మరో ఉపయోగం కూడా ఉంది. ఆ దేశపు దీవుల్లో జనాభా తగ్గిపోతుండటంతో అక్కడి ద్వీపాలో పాడుబడిన, శిథిలమైన ఆస్తులు, కట్టడాలు పెరిగిపోతున్నాయి. వాటిని పునరుద్ధరించే లక్ష్యంతో ఈ స్కీమ్‌ తీసుకొచ్చింది. అలాగే జనాభా తగ్గుదల కారణంగా టెక్నాలజీ, ఫినాన్స్‌, మెడికల్‌ ఇండస్ట్రీ సహా వివిధ విభాగాల్లో నిపుణుల కొరత కూడా తీవ్రంగా ఏర్పడింది.

దీన్ని అధిగమించి ఆయా విభాగాల్లో అత్యంత ప్రతిభావంతులైన వారు తమ దేశంలో స్థిరపడేలా ప్రోత్సహించడంలో భాగంగానే ఐర్లాండ్‌ ఈ పాలసీని తీసుకొచ్చింది. దీనివల్ల ఆయా విభాగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు.. ప్రపంచ దేశాలతో కమ్యూనికేషన్‌ పెంచుకోవచ్చని ఆశిస్తోంది. అందుకే ఈ పాలసీలో భాగంగా ఎంపికైన వారికి ఏడాదికి 20వేల యూరోల ( రూ.17 లక్షలు ) చొప్పున ఐదేండ్ల పాటు ట్యాక్స్‌ క్రెడిట్‌ కూడా ఆఫర్‌ చేస్తుంది. అంతేకాకుండా స్టార్టప్‌ల కోసం ఫండింగ్‌, రీలొకేషన్‌కు అయ్యే ఖర్చు భరించడంతో పాటు ఉద్యోగాలు పొందడంలో సహాయం కూడా చేయనుంది.

దీనికి కొన్ని కండిషన్లు కూడా ఉన్నాయి. ఐర్లాండ్‌ దేశంలో సెటిల్‌ అవ్వాలంటే కచ్చితంగా అక్కడ ఓ నివాసాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అది కూడా 1993 కంటే ముందు నిర్మించినదై ఉండాలి. పైగా అ ప్రాపర్టీ కనీసం రెండేండ్లుగా ఖాళీగా ఉండాలి. అలా ఖాళీగా ఉన్న నివాసాన్ని కొనుగోలు చేసి అందులో ఉంటే రూ.71లక్షలు ఇస్తారు. అలా ఇచ్చిన డబ్బులను మనకు ఇష్టం వచ్చిన దానికి వాడుకోవడానికి కుదరదు. ఆ డబ్బును ప్రాపర్టీ మెయింటేనెన్స్‌, పునర్నిర్మాణ ఖర్చుల కోసమే వినియోగించాలి. ఈ ఆఫర్‌ నచ్చినవాళ్లు జూలై 1వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చని ఐర్లాండ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.