ఇజ్రాయెల్‌తో గత ఏడాది కాలంగా యుద్ధం చేస్తున్న హమాస్ మిలిటెంట్ గ్రూపుకు భారీ షాక్ తగిలింది. హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగిన వైమానిక దాడిలో హనియా మరణించాడని ఇరాన్ ప్రభుత్వంతో పాటు హమాస్ గ్రూపు కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం, భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
ఈ వైమానిక దాడిలో హనియాతోపాటు ఆయన బాడీగార్డు కూడా మరణించాడని తెలిపాయి. లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా టాప్ కమాండర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ మంగళవారం సాయంత్రం ప్రకటించిన కొద్ది గంటల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరై, ఇంటికి వచ్చిన తర్వాత ఈ వైమానికి దాడి జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.