ఇజ్రాయెల్-హమాస్ మధ్య వార్ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం మరో ఆస్పత్రిపై బాంబుల వర్షం కురిపించింది. గాజా స్ట్రిప్‌లో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిని దిగ్బంధించి, రోజుల తరబడి తనిఖీలు చేస్తూ హమాస్ ఆయుధాలు, సొరంగాల ఫొటోలు విడుదల చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు ఉత్తర గాజాలోని ఇండోనేసియన్ హాస్పిటల్‌ను లక్ష్యంగా చేసుకుంది.
ఇక్కడ పెద్ద సంఖ్యలో రోగులు, క్షతగాత్రులు, వేలాది మంది సామాన్య పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు. సోమవారం క్షిపణులు ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా ఇండోనేసియన్ ఆసుపత్రిపై క్షిపణులు ప్రయోగించింది.ఈ దాడిలో ఆసుపత్రి రెండో అంతస్తు ధ్వంసమైంది. కనీసం 12 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఆసుపత్రుల్లో హమాస్ స్థావరాలు, ఆయుధ నిల్వలు ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్ తేల్చిచెబుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో మృతుల సంఖ్య 13,000కు చేరిందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. వారిలో చాలామందిని అల్–షిఫా ఆసుపత్రి కింది భాగంలోని సొరంగాల్లో మిలిటెంట్లు దాచిపెట్టారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారలను తాజాగా బయటపెట్టింది.
అల్–షిఫాలో అక్టోబర్ 7న నిఘా కెమెరా చిత్రీకరించిన ఒక వీడియోను ఇజ్రాయెల్ తాజాగా బహిర్గతం చేసింది. ఇందులో ఇద్దరు బందీలను అల్–షిఫాలోకి మిలిటెంట్లు బలవంతంగా లాక్కెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారిద్దరూ థాయ్‌లాండ్, నేపాల్ జాతీయులు. ప్రస్తుతం వారు ఎక్కడున్నారన్నది తెలియరాలేదు.