ఇజ్రాయెల్ నుంచి ప్రతీకారాన్ని ఎదుర్కొంటున్న గాజా స్ట్రిప్‌కు భారతదేశం అండగా నిలుస్తుందన్నారు. భారత్ తరపున 38 టన్నుల ఆహార పదార్థాలు, ముఖ్యమైన వైద్య పరికరాలను గాజాకు పంపినట్లు యునైటెడ్ నేషన్ డిప్యూటీ పర్మినెంట్ రిప్రజెంటివ్(డీపీఆర్) ఆర్ రవీంద్ర తెలిపారు. గాజాలో శాంతి నెలకొల్పేందుకు అవసరమైన పరిస్థితులను సృష్టించాలని, ప్రత్యక్ష సంభాషణల పునరుద్ధరణకు కృషి చేయాలని ఆయా దేశాలను కోరుతున్నామన్నారు.
అక్టోబరు 7న హమాస్ దాడి అనంతరం ఇజ్రాయెల్.. గాజాపై బాంబు దాడులను కొనసాగించింది. ఈ నేపధ్యంలో గాజాలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఉగ్ర దాడిని భారతదేశం నిర్ద్వంద్వంగా ఖండించిందని రవీంద్ర తెలిపారు. గాజాలో జరిగిన ప్రాణనష్టంపై తొలుత సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రపంచ నేతలో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని ఆయన పేర్కొన్నారు.
ఈ దాడుల్లో వందలాది మంది పౌరులు మరణించారని, గాజాలోని అల్ హాలీ ఆసుపత్రిలో విషాదకర వాతావరణం నెలకొన్నదన్నారు. బాధిత కుటుంబాలకు భారత్ తరపున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నామని, బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు.