Tokyo, OCT 12: గిఫ్ట్ వచ్చిందని, లాటరీ తగలిందని చేసే మోసాల గురించి చూసి, విని ఉంటాం. అంతెందుకు ఓటీపీ మోసాలు (OTP Scams), ఆన్ లైన్ మోసాలు కూడా విన్నాం. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి న్యూడ్ కాల్స్ తో బెదిరించి డబ్బులు గుంజుతున్నవాళ్ల గురించి కూడా చూశాం. కానీ జపాన్ లో (Japan) ఓ వృద్ధురాలిని నమ్మశక్యం కాని విధంగా మోసం చేశాడు ఓ వ్యక్తి. తాను స్పేస్‌లో (Space) పనిచేస్తున్నాను, కిందకు వచ్చేందుకు టికెట్ డబ్బులు కావాలంటూ మోసం చేసి ఏకంగా 25లక్షలు వసూలు చేశాడు. పైగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, స్పేస్ నుంచి కిందకు రాగానే ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ తియ్యటి కబుర్లు చెప్పాడు. ఈ ఘటన జపాన్‌లో వెలుగు చూసింది. జపాన్‌కు చెందిన ఒక 65 ఏళ్ల వృద్ధురాలి ప్రొఫైల్ చూసిన ఒక వ్యక్తి.. ఆమెను సంప్రదించాడు. తను రష్యాకు చెందిన వ్యోమగామినని, అంతర్జాతీయ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో అన్నీ అక్కడి నుంచి తీసినస్పేస్ ఫొటోలు పోస్టు చేశాడు. ఇవన్నీ చూసిన ఆమె నమ్మేసింది.
ఇలా వాళ్లిద్దరి స్నేహం ముదరడంతో జపాన్‌లో ఎక్కువగా వాడే మెసేజింగ్ యాప్ లైన్‌లో (Line App) ముచ్చటించుకోవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తిరిగి భూమ్మీదకు రావడానికి, అలాగే జపాన్ చేరుకోవడానికి ఒక రాకెట్ కొనాలని, దానికోసం డబ్బు ఖర్చవుతుందని ఆ వ్యక్తి చెప్పాడు. ‘జపాన్‌లో నీతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నా. ఎన్నిసార్లు చెప్పినా తృప్తిగా ఉండదు.. అయినా మళ్లీ మళ్లీ చెప్తున్నా ఐ లవ్ యూ’ అంటూ అతను మెసేజ్‌లు పంపడంతో ఆమె మనసు కరిగి పోయింది. ఆ మాటలు నమ్మిన ఆమె ఐదు దఫాలుగా 4.4 మిలియన్ యెన్ (సుమారు రూ.20 లక్షలు) పంపించింది. ఈ డబ్బు తీసుకున్న అతను తిరిగి రాకపోగా.. మరింత డబ్బు కావాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిందామెకు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది.
రొమాంటిక్ స్కామ్‌గా కేసు నమోదు చేసుకున్న జపాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు భారీగా పెరిగాయని, జపాన్‌లో ఇవి గత పదేళ్లలో 67 శాతం పెరిగాయని సమాచారం. కాబట్టి ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని వాళ్లు సూచిస్తున్నారు.