Joe Biden | File Image | (Photo Credits: Getty Images)

Washington, November 8: అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Presidential Election 2020) డెమొక్రాటిక్‌ అభ్యర్థి జోసెఫ్‌ రాబినెట్‌ బిడెన్‌నే (77) (Joe Biden) చివరికి విజయం వరించింది. ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా (Joe Biden Elected 46th US President) శ్వేతసౌధంలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలిమహిళగా, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ రికార్డుసృష్టించనున్నారు.మొత్తం 538 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లకుగానూ బైడెన్‌ 290 ఓట్లు సాధించినట్లు అసోసియేట్‌ ప్రెస్‌ వార్తా సంస్థ వెల్లడించింది.

నార్త్ కరోలినా ఫలితం ఇంకా తేలకపోవడంతో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమైనట్లు తెలుస్తుంది. మొత్తం 284 ఓట్లు బైడెన్‌ ఖాతాలో జమయ్యాయి. జార్జియా(16,) నార్త్‌ కరోలినా(15) అలాస్కా(3) వంటి రాష్ట్రాల్లో కౌంటింగ్‌ జరుగుతోంది. ఈ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తుది ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపదు. దీంతో బైడెనే తదుపరి అధ్యక్షుడని సీఎన్‌ఎన్, వాషింగ్టన్‌ పోస్ట్‌ తదితర ప్రముఖ వార్తా సంస్థలు ప్రకటించాయి.

వివాదాల మధ్య జూనియర్ ట్రంప్ ట్వీటు, మ్యాప్‌లో జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌ ఇండియా నుంచి అవుట్, మండి పడుతున్న విపక్షాలు, ట్వీటుపై స్పందించిన పలువురు ప్రముఖులు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిసిన వెంటనే బైడెన్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. అమెరికా దేశానికి నాయకత్వం వహించడానికి ప్రజలు నన్ను ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నా. మీరు నాకు ఓటేసినా వేయకున్నా అందరు అమెరికన్లకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తా. నా లక్ష్యం చాలా కష్టమైంది. అయినప్పటికీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా’ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు జో బైడెన్‌ కంటే నా కంటే కూడా దేశానికే ఎక్కువ అవసరం. ఇవి అమెరికా ఆత్మ గౌరవానికి సంబంధించినవి. అందుకోసం మనం పోరాడుదాం. లక్ష్యం సాధించేందుకు అందరం కలిసి పనిచేయడం ప్రారంభిద్దాం’ అని కమలా హ్యారిస్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఓటమిని అంగీకరించని ట్రంప్

ఇదిలా ఉంటే ఫలితం స్పష్టంగా తేలినా.. ట్రంప్‌ తన అంగీకరించడం లేదు. విజేతను నేనే. వక్రమార్గంలో, తప్పుడుగా ప్రకటించుకోజాలరు. నేనూ అలా ప్రకటించుకోగలను. కానీ, నేను అలా చెయ్యలేదు. ఇంకా కోర్టు కేసులున్నాయన్న మాట మరిచిపోవద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా పెన్సిల్వేనియా లెక్కింపుపై ఆయన మండిపడ్డారు. ‘‘కౌంటింగ్‌ రూమ్‌ల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. వేలకొద్దీ అక్రమ ఓట్లు వచ్చి చేరుతున్నాయి. నవంబరు 3వ తేదీ రాత్రి 8 గంటల తరువాత వచ్చిన ఓట్లనూ లెక్కిస్తున్నారు... మా పరిశీలకులను చాలా సేపు తర్వాత కానీ అనుమతించడం లేదు. ఇది అక్రమం. ఇక్కడి ఫలితమేకాక- అనేక రాష్ట్రాల్లో ఫలితాలు తారుమారవడం ఖాయమని ఆయన ట్వీట్‌ చేశారు. ఓపక్క ఓట్ల లెక్కింపు లెక్కలు వస్తూనే ఉన్న సమయంలో ఆయన శనివారం మధ్యాహ్నం గోల్ఫ్‌ కోర్స్‌కు వెళ్లి కాసేపు గోల్ఫ్‌ ఆడారు. తన సన్నిహితులతో పిచ్చాపాటీగా గడిపారు.

బైడెన్ ప్రస్థానం

1942లో భారత్‌లో క్విట్‌ ఇండియా ఉద్యమం నడుస్తున్న కాలంలో అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాంటన్‌ ప్రాంతంలో బైడెన్‌ జన్మించారు. బైడెన్‌ చిన్నప్పటి నుంచే మొండివారని ఆయన మిత్రులు చెప్తారు.యూనివర్సిటీ ఆఫ్‌ డెలావర్‌లో చదివారు. 1968లో సైరకాస్‌ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. బైడెన్‌కు పదేండ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయన తండ్రి టోర్‌ బైడెన్‌ తమ మకాంను డెలావర్‌కు మార్చారు. 1966లో బైడెన్‌ నీలియా హంటర్‌ను వివాహమాడారు. వారికి ముగ్గురు పిల్లలు. డెలావర్‌లోనే బైడెన్‌ రాజకీయ జీవితం పురుడుపోసుకున్నది.

1972లో జరిగిన కారు ప్రమాదంలో బైడెన్‌ మొదటి భార్య, 13 నెలల వారి కుమార్తె నవోమీ మరణించారు. నీలియా మరణానంతరం 1977లో ఆయన జిల్‌ జాకబ్స్‌ను రెండో పెండ్లి చేసుకున్నారు. వారికి ఒక కూతురు. 1988లో బైడెన్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు ఆయన ప్రాణాలకే ముప్పు ఏర్పడింది. 2015లో బైడెన్‌ కుమారుడు బ్యూ బ్రెయిన్‌ క్యాన్సర్‌తో చనిపోయారు. అప్పుడే భార్య మాదకద్రవ్యాలకు బానిసయ్యారు. ఆ సమయంలో బైడెన్‌ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

బైడెన్‌ 1972లో 29ఏండ్ల వయస్సులో డెలావర్‌ నుంచి మొట్టమొదటిసారి సెనేట్‌కు ఎన్నికయ్యారు. అతి తక్కువ వయస్సులో సెనేట్‌కు ఎన్నికైన ఐదో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆ సమయంలోనే ఓ రోడ్డు యాక్సిడెంట్‌లో భార్య నీలియా, కూతురు నవోమీ చనిపోయారు. ఇద్దరు కుమారులకు తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో తనకు ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని బైడెన్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఆయన మొత్తం 6 సార్లు సెనేట్‌కు ఎన్నికయ్యారు.

అమెరికా చరిత్రలో పిన్నవయసులో సెనేటర్లలో ఒకడిగా రికార్డు సృష్టించిన బైడెన్‌ ఇప్పుడు అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా మరో రికార్డు నెలకొల్పబోతున్నారు. ఆయన గతంలో ఆరుసార్లు సెనేటర్‌గా ఎన్నికయ్యారు. 1988, 2008లో అధ్యక్ష పదవి కోసం పోటీపడినప్పటికీ డెమొక్రటిక్‌ పార్టీలోనే విజయం సాధించలేకపోయారు. మూడో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బైడెన్‌ రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

కమలా హ్యారీస్ ప్రస్థానం

భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఒక మహిళ, ఒక ఆసియన్‌ అమెరికన్‌కు ఈ పదవికి దక్కడం ఇదే తొలిసారి. ఆమె ఇంతకుముందే శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు.

కమలా హ్యారిస్‌ 1964 అక్టోబర్‌ 20న ఒక్లాండ్‌లో జన్మించారు. ఆమె తల్లి తమిళనాడులోని సంప్రదాయ కుటుంబానికి చెందినవారు. తండ్రి జమైకా దేశస్తుడు. వాషింగ్టన్‌ డీసీలోని హోవార్డ్‌ యూనివ ర్సిటీలో కమల చదువుకున్నారు. యూసీ హేస్టింగ్స్‌ కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు. అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయంలో ఎనిమిది సంవత్స రాలు పనిచేశారు. ప్రధానంగా చిన్నా రులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేస్తున్నప్పుడు బరాక్‌ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్ర టిక్‌ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు.

జో బైడెన్‌ ఎన్నికయ్యారన్నది తెలియగానే శ్వేతసౌధం ఎదుట వేలాదిమంది గుమిగూడారు. జో బైడెన్‌-కమలా హారిస్‌ అన్న ప్లకార్డులు పట్టుకుని వారిద్దరికీ అనుకూలంగా నినాదాలు చేశారు. ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. వాషింగ్టన్‌లోనే కాక- అనేక అమెరికన్‌ నగరాల్లో డెమాక్రాట్‌ మద్దతుదారులు పెద్ద ఎత్తున వీధుల్లోకొచ్చి సంతోషంగా నాట్యం చేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. బాణాసంచా కాల్చారు. బైడెన్‌-కమల ఇద్దర్నీ అభినందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, బిల్‌ క్లింటన్‌లతో పాటు హిల్లరీ, జెబ్‌ బుష్‌, ఇంకా అనేకమంది ప్రముఖులు ట్వీట్‌ చేశారు.