Malala Yousafzai: పెళ్లి చేసుకున్న నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా, పాక్‌ యువకుడితో నిరాడంబరంగా నిఖా.

Birmingham home November 10:  నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ (Malala Yousafzai) సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. అస్సర్‌ మాలిక్‌ అనే యువకుడితో మలాలా వివాహ వేడుక నిరాడంబరంగా జరిగింది. బర్మింగ్‌హామ్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో మాలిక్‌ను నిఖా (Nikkah) చేసుకున్నారు. తన వివాహానికి సంబంధించిన ఫోటోలను మలాలా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

మలాలా భర్త మాలిక్ ఎవ‌ర‌ని ప్రస్తుతం ఇంట‌ర్నెట్‌లో జోరుగా సెర్చ్ సాగుతోంది. మ‌లాలా భ‌ర్త అస‌ర్ మాలిక్ ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హై ప‌ర్ఫార్మెన్స్ సెంట‌ర్‌లో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా చేస్తున్నారు. గ‌త ఏడాది మే నెల‌లో ఆయ‌న పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ఉద్యోగిగా చేరారు. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో ఆడుతున్న ముల్తాన్ సుల్తాన్ జ‌ట్టుకు ఆయన ఆప‌రేష‌న‌ల్ మేనేజ‌ర్‌గా చేశారు. గ‌తంలో ప్లేయ‌ర్ మేనేజ్మెంట్ ఏజెన్సీని కూడా న‌డిపారు. లాహోర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ నుంచి 2012లో ఆర్థిక‌శాస్త్రం, రాజ‌నీతి శాస్త్రం నుంచి బ్యాచిల‌ర్స్ డిగ్రీ ప‌ట్టా పొందారు.

పాకిస్థాన్‌లో బాలిక‌ల విద్యాహ‌క్కు గురించి మ‌లాలా పోరాటం చేశారు. ఖైబ‌ర్ ఫ‌క్తున్సాలోని స్వాట్ వ్యాలీ ఆమె సొంతం ప్రదేశం. అక్కడ తాలిబ‌న్ల అరాచ‌కం కొన‌సాగేది. అమ్మాయిల చ‌దువును తాలిబ‌న్లు అడ్డుకునేవారు. ఆ స‌మ‌యంలో మ‌లాలా ఉద్యమం చేప‌ట్టారు. దానికి ప్రతీకారంగా 2012, అక్టోబ‌ర్ 9న మ‌లాలాపై తాలిబ‌న్ల దాడి చేశారు. ఆ దాడిలో మ‌లాలా త‌ల‌కు తీవ్ర గాయ‌మైంది. బుల్లెట్లు దిగ‌డంతో మ‌లాలా కొన్ని రోజులు కోమాలోకి వెళ్లారు. తొలుత రావ‌ల్పిండిలో చికిత్స తీసుకున్నారు. బ‌ర్మింగ్‌హామ్‌లో ఆమె పుర్రెకు స‌ర్జరీ చేశారు. మ‌హిళ‌ల విద్యాహ‌క్కు గురించి పోరాటం చేసిన మ‌లాలాకు 2014లో నోబెల్ శాంతి బ‌హుమ‌తి ద‌క్కింది.