New Delhi, JAN 07: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవలి లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై భారత్‌తోపాటు అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీవుల (Maldives) ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులపై వేటు వేసింది. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిని పదవి నుంచి తప్పించినట్లు వార్తలు వచ్చాయి. మాల్దీవుల స్థానిక మీడియా ప్రకారం, మరియం షియునా, మాల్షాతోపాటు మరో మంత్రి హసన్ జిహాన్‌లను మంత్రి పదవుల నుంచి తప్పించినట్లు కథనాలు వెలువడ్డాయి.
భారత్‌తోపాటు మోదీని ఉద్దేశిస్తూ మాల్దీవుల్లో అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై అక్కడి విదేశాంగ శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. ప్రభుత్వంతో సంబంధం లేదని పేర్కొంది. మంత్రులు అటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ముగ్గురు మంత్రులను తొలగించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే మంత్రుల తొలగింపు ఫేక్ న్యూస్ అంటూ మాల్దీవ్స్ డిప్యూటీ మినిస్టర్ స్పష్టం చేశారు. ఆ వార్తలను కొట్టిపారేశారు.