Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, August 10: ప్రపంచాన్ని ఇప్పటికే ఎన్నో వైరస్ లు ముప్పతిప్పలు పెట్టాయి. తాజాగా కరోనా వైరస్ ప్రజలను కోలుకోని విధంగా దెబ్బ తీస్తోంది.. కరోనాకు చెందిన రకరకాల వేరియంట్ల నుంచి మానవాళి ఇంకా సురక్షితంగా బయటపడక ముందే ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్ (Marburg Virus Detected in South Africa) బయటపడింది. ఆఫ్రికాలోని గినియా దేశంలో మార్బర్గ్ వైరస్ కేసును గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.ఎబోలా, కోవిడ్‌19 లాంటి వైర‌స్‌ల త‌ర‌హాలోనే మార్‌బర్గ్ కూడా ప్రాణాంత‌కమైంద‌ని వెల్లడించింది

ఎబోలా జాతికి చెందిన ఈ వైరస్ (Ebola-Related Disease) కరోనా తరహాలోనే అత్యంత వేగంగా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ మార్‌బర్గ్ వ్యాధి (Marburg Disease) వైరస్ సోకిన వారిలో 24 శాతం నుంచి 88 శాతం వరకు చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రారంభంలోనే ఈ వైరస్ కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇది గబ్బిలాల్లో వ్యాపించే వైరస్ అని... వాటి నుంచి మనుషులకు ఇది సోకి ఉంటుందని చెప్పింది. గుకిడెవో రాష్ట్రంలో ఆగ‌స్టు 2వ తేదీన చ‌నిపోయిన ఓ పేషెంట్ నుంచి తీసుకున్న శ్యాంపిళ్ల ద్వారా ఈ విష‌యాన్ని ద్రువీక‌రించారు.

సాధారణంగా మార్బర్గ్ వైరస్ రోసెట్టస్ గబ్బిలాలు ఉండే చోట కనిపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వాటి ఆవాసాలకు సమీపంలోకి వెళ్లే వారికి ఈ వైరస్ సోకుతుందని చెప్పింది. ఈ వైరస్ మనుషులకు సోకిన తర్వాత ఇతరులకు సులువుగా వ్యాపిస్తుందని తెలిపింది. వైరస్ బారిన పడిన వారు ఉపయోగించిన వస్తువుల ద్వారా ఇది ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని చెప్పింది. మార్బర్గ్ వైరస్ సోకగానే తీవ్ర జ్వరం, విపరీతమైన తలనొప్పి, చికాకు కలుగుతాయి. ఈ వైరస్ కు వ్యాక్సిన్, చికిత్స లేదు. అయితే, ఆయా లక్షణాలకు ప్రత్యేకంగా చికిత్సను అందించడం ద్వారా బాధితుడి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది.

చైనాలో కొత్తగా ఆంత్రాక్స్‌ నిమోనియా వైరస్, గొర్రెలు, పశువుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్న ఆంత్రాక్స్‌ వ్యాధి, మరోవైపు డ్రాగన్ కంట్రీలో మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

మార్‌బ‌ర్గ్ వైర‌స్ గురించి జెనీవాలో మాట్లాడిన డ‌బ్ల్యూహెచ్‌వో.. ఆ వైర‌స్ జాతీయ‌, ప్రాంతీయ స్థాయిలో మాత్ర‌మే విస్త‌రిస్తుంద‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాప్తి చెందే అవ‌కాశాలు లేవ‌న్న‌ది. గుహ‌లు, గ‌నుల్లోకి వెళ్ల‌డం వ‌ల్ల మార్‌బ‌ర్గ్ వైర‌స్ గ‌బ్బిలాల నుంచి సోకే ప్ర‌మాదం ఉంది. సియ‌ర్రా లియోన్, లిబేరియా బోర్డ‌ర్ వ‌ద్ద ఉన్న ఓ గ్రామంలో మార్‌బ‌ర్గ్ కేసు న‌మోదు అయ్యింది. తొలుత ఆ పేషెంట్‌కు మ‌లేరియా ప‌రీక్ష నిర్వ‌హించారు. కానీ ఆ త‌ర్వాత అది మార్‌బ‌ర్గ్ అని తేల్చారు. దక్షిణాఫ్రికా, కాంగో, కెన్యా, ఉగాండా, అంగోలా దేశాల్లో కూడా ఈ వైరస్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి.