New Delhi, JAN 10: ముంబయి ఉగ్రదాడి సూత్రధారి, చట్టవిరుద్ధమైన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ (Hafiz Saeed) పాకిస్థాన్‌లో 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడా అంటే అవునంటోంది ఐక్యరాజ్యసమితి (UNO). హఫీజ్ సయీద్ ఏడు తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నాడని యూఎన్ తెలిపింది. 2008వ సంవత్సరంలో హఫీజ్ ను (Hafiz Saeed) అంతర్జాతీయ ఉగ్రవాదిగా యూఎన్ భద్రతా మండలి ప్రకటించింది. 2020 ఫిబ్రవరి 12వతేదీ నుంచి ఈయన జైలు శిక్ష అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
2023వ సంవత్సరం డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను భారత్‌కు అప్పగించాలని భారతదేశం పాకిస్థాన్‌ను (Pakistan) కోరింది. అతను పలు ఉగ్రవాద కేసుల్లో భారత దర్యాప్తు సంస్థలకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. ఉగ్రవాది హఫీజ్ ఆస్తుల స్తంభన, ప్రయాణ నిషేధం, ఆయుధాలపై ఆంక్షలను భద్రతా మండలి విధించింది. లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు సయీద్ డిప్యూటీ హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టావిలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.