Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Pyongyang, Jan 25: ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరాన్ని అంతుచిక్కని వ్యాధి వణికిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 5 రోజుల లాక్ డౌన్ (Lockdown in North Korea) విధించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, ఎవ్వరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్యాంగ్యాంగ్ నగరంలో శ్వాసకోశ వ్యాధి బాధితుల సంఖ్య పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.

ఈమేరకు సియోల్ (దక్షిణ కొరియా రాజధాని) కేంద్రంగా వెలువడే ఉత్తర కొరియా పత్రిక ఒకటి ఈ వివరాలను ప్రచురించింది. ప్యాంగ్యాంగ్ లో లాక్ డౌన్ (5-day lockdown ) విషయాన్ని, ప్రభుత్వ నోటీసు సహా బుధవారం ప్రచురించింది.ఈ నోటీసులో అధికారులు శ్వాసకోశ వ్యాధి (respiratory illness) అని పేర్కొన్నప్పటికీ అది కరోనానే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్క దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండొచ్చని దక్షిణ కొరియా సందేహం వ్యక్తం చేస్తోంది.

చైనాలో రోజుకు 36 వేల కరోనా మరణాలు, లూనార్ న్యూ ఇయర్ సెలవుల్లో వైరస్ తీవ్రరూపం దాల్చుతుందని తెలిపిన డేటా అనలిటిక్స్ కంపెనీ ఎయిర్‌ఫినిటీ

నగరంలో లాక్ డౌన్ గురించి ప్యాంగ్యాంగ్ పౌరులకు ముందే సమాచారం ఉందని, మంగళవారం అక్కడి ప్రజలు పెద్ద మొత్తంలో సరుకులు కొనుగోలు చేసి తీసుకెళ్లడం కనిపించిందని ఉత్తర కొరియా వార్తలు ప్రచురించే వెబ్ సైట్ ‘ఎన్ కే న్యూస్’తెలిపింది. దేశంలో జరిగే మిగతా అన్ని విషయాల లాగే కరోనా వ్యాప్తిని కూడా ఉత్తర కొరియా రహస్యంగానే ఉంచుతోంది. కిందటేడాది వరకు తమ దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించలేదని చెబుతూ వచ్చింది.

ప్యాంగ్యాంగ్ లో కరోనా కేసులు గుర్తించినట్లు గతేడాది మొదట్లో ప్రకటించిన నార్త్ కొరియా.. ఆగస్టుకల్లా వైరస్ ను జయించామని వెల్లడించింది. దేశంలో ఒక్క కేసు కూడా లేదని, చికిత్సతో అందరూ కోలుకున్నారని ప్రకటించింది. తాజాగా, ప్యాంగ్యాంగ్ లో లాక్ డౌన్ విధించడం చూస్తుంటే.. నార్త్ కొరియాలో కరోనా కల్లోలం భారీగానే ఉన్నట్లుందని దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.