Pyongyang, SEP 08: కిమ్‌జోంగ్ ఉన్ (Kim Jong Un) నేతృత్వంలోని ఉత్తరకొరియా (North Korea) అణు కార్యక్రమాలను ఏమాత్రం ఆపడంలేదు. ఏకంగా ‘టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ సబ్‌మెరైన్’ను తయారు చేసినట్లు నేడు ప్రకటించింది. రెండు రోజుల క్రితం ప్యాంగ్యాంగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కిమ్ స్వయంగా పాల్గొన్నారు. ఓ షిప్ యార్డ్‌లో సబ్‌మెరైన్‌ను పరిశీలిస్తున్న ఫొటోను విడుదల చేశారు. దీని నుంచి అణ్వాయుధాలు కూడా ప్రయోగించవచ్చని ఉ.కొరియా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఇది సోవియట్ కాలం నాటి రోమియో శ్రేణి సబ్‌మెరైన్ (Sub marine) డిజైన్ ఆధారంగా చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త సబ్‌మెరైన్‌కు ‘హీరో కిమ్ గన్-ఓకే’ అనే పెట్టారు. దీని హల్ నంబర్ 841. ఈ సబ్‌మెరైన్ నుంచి రెండు వరుసల్లో 10 న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించవచ్చు.
🇰🇵 North Korea launches new nuclear submarine
The ceremony was attended by the country's leader Kim Jong-un. pic.twitter.com/xnWX8xfyHA
— Sprinter (@Sprinter99800) September 7, 2023
రష్యా సబ్‌మెరైన్‌లో ఉత్తరకొరియా భారీగానే మార్పులు చేసిందని నౌకాదళ నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం అణుదాడి చేసేది మాత్రమే కావచ్చని.. ఇది అణుశక్తితో నడిచేది కాకపోవచ్చని అమెరికా నిపుణులు విశ్లేషిస్తున్నారు. కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో త్వరలో భేటీ అయ్యే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ అధికారి ఇటీవల తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్నందున రష్యా ఆయుధాలను సమీకరించాలనుకుంటోందని.. ఈ నేపథ్యంలోనే కిమ్ ఆ దేశంలో పర్యటించే అవకాశాలున్నాయని వెల్లడించారు.
గత నెలలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉత్తర కొరియా వెళ్లారని అమెరికా జాతీయ భద్రత మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ తెలిపారు. క్రెమ్లిన్‌కు ఆయుధాలు విక్రయించేలా చర్చలు జరిపారని చెప్పారు. అదే సమయంలో సరికొత్త న్యూక్లియర్ అటాక్ సబ్‌మెరైన్‌ను ప్యాంగ్యాంగ్ ఆవిష్కరించడం గమనార్హం. ఇటీవల అమెరికా-దక్షిణ కొరియా చేపట్టిన సంయుక్త సైనిక విన్యాసాలు ముగియడంతోనే ఉత్తర కొరియా పెద్దఎత్తున క్రూయిజ్ క్షిపణుల్ని సముద్రం పైకి ప్రయోగించింది. 11 రోజులపాటు అమెరికా-దక్షిణ కొరియా చేసిన విన్యాసాలు తమపై దురాక్రమణ కోసమేనని ఆరోపించింది.