Imran Khan On War: మేము భారత్‌తో ఎప్పటికీ యుద్ధాన్ని ప్రారంభించం! రెండు దేశాల వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి, ప్రపంచం ప్రమాదంలో పడుతుంది. ధర్మం గురించి మాట్లాడుతున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
Pakistan PM Imran Khan. (Photo Credits: Social Media)

Lahore, September 2: ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ పై ఎలాంటి  ప్రభావం చూపిందో తెలియదు కానీ, పాకిస్థాన్ పై మాత్రం తీవ్ర ప్రభావం చూపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు నెలరోజులు కావొస్తుంది మోదీ సర్కార్ ఆ నిర్ణయం తీసుకొని. భారత్ లో కూడా ఆ అంశం పాతబడిపోయింది. కానీ ఆ మంటలు పాకిస్థాన్ లో ఇంకా రగులుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ ప్రధాన అజెండా ఇప్పుడు కాశ్మీరే. అక్కడి మీడియాలో ప్రధాన వార్త ఆర్టికల్ 370, ఇండియా. ఈ క్రమంలో ఆదేశ ప్రధాని, మంత్రులు, ఇతర నాయకులు, మీడియా అంతా కలిసి భారత్ పై దుమ్మెత్తిపోయడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మరియు ఇతర దేశాలను సైతం రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కాశ్మీర్ అంశాన్ని ఎంత పెద్దది చేసి చూపిద్దామనుకున్నా, పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఏ దేశం కూడా మద్ధతు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తీవ్ర అసహనానికి గురవుతున్నారు, తమను పట్టించుకోకపోవడంపై ప్రపంచ దేశాలపై కూడా ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఇక చివరి పాచికగా భారత్ తో యుద్ధమే అని భావిస్తున్నారు, అదే సమయంలో యుద్ధం మొదట ప్రారంభించకూడదు అని వెనకడుకు కూడా వేస్తున్నారు. భారత్- పాక్ యుద్ధం ప్రపంచానికి ప్రమాదం అంటూ కొత్త భాష్యం చెప్తున్నారు.

తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'మేము భారత్ తో యుద్ధాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రారంభించము. ఇరు దేశాల వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి. ఒకవేళ భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తలు పెరిగితే మొత్తం ప్రపంచమే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది". అని లాహోర్ లో ఏర్పాటు చేసిన సిక్కు కమ్యూనిటీ సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఏదైనా సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని ఖాన్ అన్నారు. యుద్ధంలో గెలిచిన వాడు కూడా ఓడినవారితో సమానమే . యుద్ధం కొత్త సమస్యలకు ఆతిథ్యం ఇస్తుందని ఆయన అన్నారు.

ఇటీవల భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, యుద్ధం వస్తే భారత్ మొదటగా అణ్వస్త్రాలను ప్రయోగించదు అనేది ఇప్పటివరకు ఉంది. కానీ, అవసరమైతే ఆ విషయాన్ని పరిశీలిస్తాం అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఎంత రెచ్చగొట్టేలా మాట్లాడినా, మోదీ సర్కార్ మాటలతో కాకుండా దూకుడుగా తన చర్యలతో జవాబిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా, లోలోపల మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలతో అర్థమవుతుంది.

ఈ ఏడాది ఆరంభంలో, కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ సంస్థ ఆత్మాహుతి దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అప్పట్నించీ భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇరు దేశాల మాటలు రద్దయ్యాయి. ఆ తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది, భారత ఆర్మీ పాకిస్థాన్ అంతర్భాగంలోకి చొచ్చుకెళ్లి బాలకోట్లో అతిపెద్ద ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని ధ్వంసం చేసింది. అప్పట్నించి జరుగుతున్న వరుస పరిణామాలు నేడు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అయ్యేవరకు దారితీశాయి.

ఈ సందర్భంగా గతంలో భారత ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన టెలిఫోన్ సంభాషణను ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. "వాతావరణ మార్పుల కారణంగా ఇరు దేశాలలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. వీటిపై చర్చించుకుందాం, దానితో పాటే కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకుందాం అని ఆనాడే చెప్పాను. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా, భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు. భారత్ తనకు తానే ఒక సూపర్ పవర్ లాగా వ్యవహరిస్తుంది. ఏది చేయాలో, ఏది చేయకూడదో మాకు ఆదేశాలిస్తుంది". అంటూ ఇమ్రాన్ ఖాన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

మొత్తంగా చూస్తే, పాకిస్థాన్ ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని హెచ్చరికలు చేసినా భారత్ రియాక్ట్ కాకపోవడంతో, అటు మిగతా దేశాలు పట్టించుకోకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ కూడా ఇక చేసేదేం లేక నెమ్మదించినట్లే కనిపిస్తున్నారు. కాకపోతే, తన దేశంలో కాశ్మీర్ విషయంలో ఆయనపై వస్తున్న ఒత్తిడి కారణంగా ఆ అంశాన్ని సజీవంగా అలాగే కొనసాగిస్తున్నారు.