Chitral [Balochistan], February 23: పాకిస్థాన్ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ అయూబీ (Maulana Salahuddin Ayubi) 14 సంవత్సరాల బాలికను వివాహం చేసుకున్నారు. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. బెలూచిస్థాన్ జాతీయ అసెంబ్లీ మెంబర్, జమియత్ ఉలేమా ఏ ఇస్లాం నేత మౌలానా సలాహుద్దీన్ అయూబీ, ఇటీవల ఓ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన పెళ్లాడిన అమ్మాయి (Pak MP marries 14-year-old girl) వయసు 14 ఏళ్లు మాత్రమే.
అక్టోబర్ 2006లో జన్మించిన బాలిక, ఇప్పుడు జుగూర్ ప్రాంతంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతోందని స్థానిక మహిళా సంక్షేమ విభాగం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి పాకిస్థాన్ లో బాలికలకు 16 ఏళ్లు వచ్చే వరకూ వివాహం చేయరాదు. అంతకన్నా తక్కువ వయసులో పెళ్లి చేస్తే, తల్లిదండ్రులకు కఠిన శిక్షలు పడతాయి. సలాహుద్దీన్ వివాహంపై విచారణ ప్రారంభించిన పోలీసులు, బాలిక తల్లిదండ్రులను విచారించారు.
కొన్ని రోజుల క్రితం సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు బాలిక ఇంటికి చేరుకున్నారని, అయితే ఆమె తండ్రి బాలిక వివాహాన్ని ఖండించారని, ఈ మేరకు అఫిడవిట్ కూడా ఇచ్చారని చిత్రాల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ సజ్జాద్ అహ్మద్ పేర్కొన్నారు. వారు అసలు తమ అమ్మాయికి వివాహమే జరిపించలేదని అఫిడవిట్ ను ఇచ్చినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా, తన కుమార్తెకు 16 సంవత్సరాలు వచ్చే వరకు పంపవద్దని బాలిక తండ్రి అధికారులకు హామీ ఇచ్చారని లోయర్ చిత్రాల్ డిపిఓ తెలిపింది