
150-year-old Hindu Temple demolished in Karachi: దాయాది దేశం పాకిస్థాన్ కరాచీలో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. కరాచీలోని సోల్జర్ బజార్‌లో 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న మారిమాత ఆలయం ఉంది. అయితే, షాపింగ్ ప్లాజా నిర్మించేందుకు గత శుక్రవారం గుర్తు తెలియని బిల్డర్ ఆలయాన్ని కూల్చివేశారు.
ఆలయ భూమిని షాపింగ్ ప్లాజా ప్రమోటర్‌కు రూ.7కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఈ ఆలయాన్ని పోలీసుల సమక్షంలో బూల్డోజర్ల సహాయంతో కూల్చివేసినట్లు తెలుస్తున్నది. ఈ ఆలయాన్ని కరాచీలోని మద్రాసీ హిందూ సమాజం నిర్వహిస్తోంది. ఆలయ నిర్మాణం చాలా పురాతనమైందని, ఆలయ నిర్వాహకులు అయిష్టంగానే తాత్కాలికంగా దేవతా విగ్రహాలను చిన్న గదిలోకి తరలించి.. అక్కడ కొన్ని పునర్నిర్మాణ పనులు చేపట్టారని వారు తెలిపారు.
కాగా గతేడాది జూన్‌లో మారిమాత ఆలయంలోని దేవతా విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారని పంచ్‌ముఖి హనుమాన్ మందిర్ కేర్‌టేకర్ రామ్‌నాథ్ మిశ్రా మహారాజ్ తెలిపారు. ఆలయం కూల్చివేతకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. ఆలయాన్ని కూల్చివేశారని, ప్రహరి, ప్రధాన ద్వారాన్ని వదిలేసి.. లోపలి నిర్మాణాన్ని కూల్చివేశారన్నారు.
ఈ ఆలయాన్ని దాదాపు 150 ఏళ్ల కిందట నిర్మించారని, దాని ప్రాంగణం కింద నిధి ఉన్నట్లు కథలు చెప్పుకునేవారని పేర్కొన్నారు. అయితే, సుమారు 400-500 చదరపు గజాల విస్తీర్ణంలోని భూకబ్జాదారులు కన్నేశారన్నారు. అయితే, ఆలయాన్ని ప్రమాదకరమైన కట్టడమని అధికారులు ప్రకటించడంతో కూల్చివేసినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా పాకిస్తాన్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నారు. పాకిస్తాన్ హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో స్థిరపడ్డారు.ఈ ఘటనపై హిందూ సమాజం హిందూ కౌన్సిల్, సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా, సింధ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదనే వార్తలు వస్తున్నాయి.