COVID-19 Vaccine Updates: గుడ్ న్యూస్..కరోనా వ్యాక్సిన్ లైవ్‌లోకి వస్తోంది, ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్రిటన్, వచ్చే వారం నుంచి అందుబాటులోకి, అమెరికా నుంచే కరోనా వ్యాప్తి అంటూ కొత్త రిపోర్ట్ బయటకు
Vaccine | Image used for representational purpose (Photo Credits: Twitter)

London, December 2: కరోనాపై విజయం సాధించేందుకు అడుగుదూరంలో ప్రపంచం నిలిచింది. కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ (COVID-19 Vaccine Updates) వచ్చే వారం నుంచి అందుబాటులోకి రానుంది. ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ (Pfizer-BioNtech COVID-19 Vaccine) వినియోగానికి బ్రిట‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప‌్ర‌పంచంలోనే తొలిసారి వ‌చ్చే వారంలోనే ఈ వ్యాక్సిన్ (Country From Next Week) అందుబాటులోకి రానుంది.

ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమ‌తించాల‌ని మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడ‌క్ట్స్ రెగ్యులేట‌రీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) చేసిన సిఫార‌సును బ్రిట‌న్ ప్ర‌భుత్వం ఆమోదించింది.

యునైటెడ్ కింగ్‌డ‌మ్ వ్యాప్తంగా వ‌చ్చే వారం నుంచే ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంద‌ని బ్రిటన్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. వ్యాక్సిన్ వినియోగానికి అనుమ‌తి సాధించ‌డంపై ఫైజ‌ర్ సీఈవో ఆల్బ‌ర్ట్ బౌర్లా సంతోషం వ్య‌క్తం చేశారు. ఇందుకు స‌హ‌క‌రించిన ఎంహెచ్ఆర్ఏకు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

తాము మ‌రిన్ని దేశాల అనుమ‌తుల కోసం ఎదురు చూస్తున్నామ‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యుత్త‌మ నాణ్య‌త ఉన్న వ్యాక్సిన్‌ల‌ను అంద‌జేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.ఇప్ప‌టికే బ్రిట‌న్‌లోని ఆసుప‌త్రుల‌న్నీ వ్యాక్సిన్ అందుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాయ‌ని, వ‌చ్చే వారంలోనే ఈ కార్య‌క్ర‌మం మొద‌ల‌వుతుంద‌ని బ్రిట‌న్ ఆరోగ్య‌శాఖ మంత్రి మ్యాట్ హ్యాన్‌కాక్ చెప్పారు.

కరోనా నుంచి కోలుకున్నా వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు, దేశంలో తాజాగా 36,604 మందికి కోవిడ్ పాజిటివ్, 1,38,122కి చేరుకున్న మరణాల సంఖ్య

ముందుగా వైద్య సిబ్బంది, కొవిడ్ ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉన్న వృద్ధులకు ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు. ఇప్ప‌టికే బ్రిట‌న్ 4 కోట్ల వ్యాక్సిన్‌ల‌ను ఆర్డ‌ర్ చేసింది. వీటిని 2 కోట్ల మందికి ఒక్కొక్క‌రికి రెండు డోసుల చొప్పొన ఇవ్వ‌ాలని నిర్ణయించారు. ఫైజ‌ర్ కేవ‌లం ప‌ది నెల‌ల్లోనే వ్యాక్సిన్‌ను త‌యారు చేసి, ప్ర‌యోగాలు నిర్వ‌హించి, అనుమ‌తులు సాధించ‌డం విశేషం. సాధార‌ణంగా దీనికి ద‌శాబ్దాల స‌మ‌యం కూడా ప‌డుతుంది. అయితే ఇది లైవ్ లోకి వచ్చిన తర్వాత దీని ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ముక్కు ద్వారా లోపలికి కరోనా, కొత్త అంశాన్ని కనుగొన్న జర్మనీ పరిశోధకులు

కరోనా వైరస్ చైనా నుంచే వ్యాప్తి చెందిందని ప్రపంచమంతా నమ్ముతుండగా అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ఇచ్చిన రిపోర్టు ఇందుకు బిన్నంగా ఉంది. సీడీసీ... కరోనాకు సంబంధించిన ఒక కొత్త విషయాన్ని వెల్లడించింది. కరోనా మహమ్మారి గత ఏడాది డిసెంబరులోనే అమెరికాలో వ్యాప్తిచెందిందని తెలిపింది.

ఇంతకాలం అమెరికా... ఈ కరోనా వైరస్‌కు చైనానే కారణమని ఆరోపిస్తూవస్తోంది. అయితే సీడీసీ తెలిపిన ఈ వివరాలతో చైనా, అమెరికాల మధ్య మరో వివాదం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీడీసీ ఈ అధ్యయనం కోసం రెడ్‌క్రాస్ సాయంతో 7,389 బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి, పలు పరిశోధనలు నిర్వహించింది. ఈ శాంపిల్స్‌లోని 106 నమూనాలలో వైరస్ కనుగొన్నారు.