Coronavirus Scare: ముక్కు ద్వారా లోపలికి కరోనా, కొత్త అంశాన్ని కనుగొన్న జర్మనీ పరిశోధకులు, దేశంలో 31,118 కేసులు నమోదు, ఏపీలో తాజాగా 381 పాజిటివ్ కేసులు
Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

New Delhi, December 1: దేశంలో కొవిడ్‌ కేసులు (Coronavirus Scare) కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా 40వేలకుపైగా పాజిటివ్‌ నమోదు అవుతుండగా.. తాజాగా గడిచిన 24గంటల్లో 31,118 పాజిటివ్‌ కేసులు (Coronavirus Outbreak in India) నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా రికార్డయిన కేసులతో మొత్తం 94.62లక్షలు దాటాయని చెప్పింది.

తాజా అంటువ్యాధుల సంఖ్య నిన్నటిలో పోలిస్తే దాదాపు 20 శాతం తక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 482 మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య 1,37,621కు పెరిగింది. కొత్తగా 41,985 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 88,89,585 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,35,603 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కేవలం 381 పాజిటివ్ కేసులు (AP Coronavirus) మాత్రమే నమోదయ్యాయి. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 74 కేసులు, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 7 కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇదే సమయంలో మహమ్మారి వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 934 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,68,064 కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 6,992కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,840 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

వికటించిన కరోనా వ్యాక్సిన్, సీరంపై రూ. 500 కోట్ల దావా వేసిన వాలంటీర్, తీవ్రంగా ఖండించిన సీరం ఇన్‌స్టిట్యూ‌ట్‌ ఆఫ్‌ ఇండియా, ప్రతిగా వాలంటీర్‌పై రూ.100 కోట్ల దావా వేస్తామంటూ ప్రకటన

ఇదిలా ఉంటే ఏడాది కాలంగా ఉనికిని చాటుకుంటున్న కరోనా వైరస్ (Coronavirus) పై ఓ ఆసక్తికర అధ్యయనం వెలువడింది. కొవిడ్ ముక్కు ద్వారా మెదడులోకి కూడా ప్రవేశిస్తుందని జర్మనీ పరిశోధకులు గుర్తించారు. కొందరు కరోనా రోగుల్లో నరాలకు సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నవుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అధ్యయనం నేచర్ న్యూరోసైన్స్ జర్నల్ లో ప్రచురితమైంది. సార్స్ కోవ్-2 కేవలం శ్వాస వ్యవస్థనే కాకుండా, కేంద్ర నాడీ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందని, తత్ఫలితంగా రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, అలసట, వికారం, నరాలకు సంబంధించిన సమస్యలు కలుగుతాయని పేర్కొన్నారు.

కాగా, ఇటీవలి ఓ అధ్యయనంలో... మెదడులోనూ, సెరెబ్రోస్పైనల్ ద్రవాల్లోనూ వైరస్ కు సంబంధించిన ఆర్ఎన్ఏ ఉన్నట్టు గుర్తించినా, వైరస్ ఎలా ప్రవేశిస్తోందీ.. మెదడులోపలి భాగాల్లో ఎలా పాకిపోతోంది? అన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఇది ముక్కు ద్వారానే మెదడులో చొరబడుతోందన్న విషయం తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది. గొంతు పైభాగంలో ఉండే నాసికాగ్రసనిలో తొలిస్థావరం ఏర్పరచుకుంటున్న కరోనా రక్కసి, అక్కడి నుంచి నాసికా కుహరం ద్వారా మెదడులోకి పాకుతోందని తెలుసుకున్నారు. కరోనాతో మరణించిన 33 మంది రోగులపై పరిశోధనలు చేసి ఈ వివరాలు గుర్తించారు. కాగా, కరోనా వైరస్ కు సంబంధించిన జన్యుపదార్థం ఆర్ఎన్ఏ... ఘ్రాణ శ్లేష్మ పొరలో అత్యధిక పాళ్లలో ఉన్నట్టు జర్మనీ పరిశోధకులు కనుగొన్నారు.