Mumbai, November 30: కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఆశలు చిగురిస్తున్న నేపథ్యంలో వివాదాస్పద అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ (Oxford Vaccine) వేయించుకున్న ఓ వాలంటీర్‌లో నాడీ సమస్యలు తలెత్తిన ఘటనను చూసే ఉంటాం. అయితే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. సీరం ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చెన్నైలోని శ్రీరామచం ద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ వేదికగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్(కొవిషీల్డ్) (Oxford-AstraZeneca Vaccine) మూడోదశ ప్రయోగ పరీక్షల డోసులు వేయించుకున్న ఓ 40 ఏళ్ల వాలంటీర్‌లోనూ తీవ్ర నాడీ సమస్యలు(వర్చువల్ న్యూరోలాజికల్ బ్రేక్‌డౌన్) తలెత్తినట్లుగా వార్తలు వచ్చాయి.
అతను ఈ రుగ్మతలకు ప్రయోగాత్మక వ్యాక్సినే కారణమైనందున రెండు వారాల్లోగా రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలంటూ సీరం ఇన్‌స్టిట్యూట్‌కు (Serum Institute of India (SII)) లీగల్ నోటీసులు పంపారు.వ్యాక్సిన్ పై తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తుతున్నందున అది సురక్షితం కాదని దానితో ప్రయోగ పరీక్షల నిర్వహణను వెంటనే ఆపాలి. లేదంటే న్యాయపరమైన చర్యలు చేపడతానని లీగల్ నోటీసులో ప్రస్తావించారు. ఈ నోటీసులను భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ), ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ ముఖ్య శాస్త్రవేత్త ఆం డ్రూ పోలార్డ్, జెన్నర్ ఇన్‌స్టిట్యూట్ లేబొరేటరీస్(ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ), ఆస్ట్రాజెనెకా కంపెనీ(యూకే), శ్రీరామచంద్ర ఇన్‌స్టిట్యూట్ వైస్‌చాన్స్‌లర్(చెన్నై)కు పంపారు.
అయితే ఈ అంశాలను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. వాలంటీర్‌లో తలెత్తిన ఆరోగ్య సమస్యలకు, వ్యాక్సిన్ ప్రయోగాలతో ఏ సంబంధం లేదని స్పష్టంచేసింది. తన ఆరోగ్య సమస్యలను ట్రయల్స్‌కు ఆపాదించే ప్రయత్నంలో వాలంటీర్ ఉన్నారని పేర్కొంది. ఆ ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తెలిపింది. అబద్ధాలు చెప్పి కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించినందున వాలంటీర్‌పై 100 కోట్లకుపైగా పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది.
ఇదిలా ఉంటే వాలంటీర్‌ను ఆస్పత్రి నుంచి పంపేటప్పుడు డిశ్చార్జి నివేదికలో ‘అక్యూట్ ఎన్‌సెఫలోపతి’ నుంచి కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. విటమిన్ బీ12, విటమిన్ డీ లోపాలతో పాటు కనెక్టివ్ టిష్యూ డిజార్డర్’తో వాలంటీర్ బాధపడుతున్నట్లు తెలిపారు. శ్రీరామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నైతిక విలువల కమిటీ నివేదికలోని అంశాలు వాలంటీర్ వాదనకు భిన్నంగా ఉన్నాయి. వాలంటీర్‌లో దుష్ప్రభావాలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ కారణం కాదు. ఇదే విషయాన్ని డీసీజీఐకూ నివేదించామని ఎస్ఐఐ చెప్పింది.
వాలంటీర్ పరిస్థితిపై ఆయన భార్య మాట్లాడుతూ.. మా ఆయన ఎవరినీ గుర్తు పట్టలేకపోయారు. మతి తప్పినట్లుగా ప్రవర్తించారు. దీంతో నా భర్తను వైద్యులు వెంటనే ఐసీయూకు తరలించారు. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ టెస్టులు చేసినా ఫలితం నెగెటివ్‌గానే వచ్చింది. వ్యాక్సిన్ వల్లే ఆయన ఈ స్థితికి వచ్చారు. అక్టోబరు 26న విజ్ఞప్తి చేయడంతో నా భర్తను డిశ్చార్జి చేశారు. ఇప్పుడు ఇంటి వద్ద కూడా ఆయన మానసిక ప్రవర్తన అలాగే ఉంది. దీంతో ఆయనను మంచానికి కట్టేయాల్సి వస్తోంది. మెదడు సమస్యల వల్ల కన్సల్టెన్సీ పనులపై మునుపటిలా దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. మాకు రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాల్సిందేననని వాలంటీర్ భార్య పేర్కొన్నారు.
జనవరిలో వాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపిన సీరం
కాగా సెప్టెంబరు 29న జరిపిన ప్రాథమిక పరీక్షల్లో వాలంటీర్‌గా ఎంపికైన ఆయనకు.. అక్టోబరు 1న తొలి డోసును అందించారు. మొదటి పదిరోజుల పాటు ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదు. ఆ తర్వాత తీవ్ర తలనొప్పి, వాంతులు మొదలయ్యాయి. తనకు ఏం జరుగుతోందో కూడా గ్రహించలేని స్థితికి వాలంటీర్ చేరడంతో.. సీటీ-స్కాన్ తరహా పరీక్ష చేయించాలని ఓ వైద్యుడు సూచించారు. ఈనేపథ్యంలో కొవిషీల్డ్ ట్రయల్ డోసును అందించిన చెన్నైలోని శ్రీరామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌లోనే అక్టోబరు 11న వాలంటీర్‌ను కుటుంబీకులు చేర్పించారు.