Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, Dec 2: భారత్‌లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 36,604 మందికి కరోనావైరస్‌గా (India Coronavirus) నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 94,99,414కి (Coronavirus in India) చేరింది. ఇక గత 24 గంటల్లో 43,062 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 501 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,38,122కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 89,32,647 మంది కోలుకున్నారు. 4,28,644 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

కరోనా వైరస్‌ బారినపడి గుజరాత్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు అభయ్ భరద్వాజ్ కన్నుమూశారు. ఈ ఏడాది ఆగస్టులో ఆయన కరోనావైరస్ బారినపడటంతో రాజ్‌కోట్‌లోని హాస్పిటల్‌లో ఆయనకు చికిత్స అందించారు. కానీ అక్కడ తీవ్ర ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయినా పరిస్థితి మెరుగు కాక పోవడంతో భరద్వాజ్ మంగళవారం ప్రాణాలు విడిచారు.

ముక్కు ద్వారా లోపలికి కరోనా, కొత్త అంశాన్ని కనుగొన్న జర్మనీ పరిశోధకులు

ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అహ్మద్ పటేల్ కరోనాతో నవంబర్ 26న మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఒక వారంలోనే ఇద్దరు రాజ్యసభ ఎంపీలను గుజరాత్‌ కోల్పోయింది. ఎంపీ అభయ్ భరద్వాజ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌లో సంతాపం వ్యక్తం చేశారు. కాగా రాజ్‌కోట్‌కు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు, వృత్తిరీత్యా న్యాయవాది భరద్వాజ్ ఈ ఏడాది జూలైలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

కోవిడ్ నుంచి కోలుకున్నవారిలోని కొందరు పలు ఆనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. యూపీలోని కిద్వాయీనగర్ ప్రాంతానికి చెందిన ఒక వృద్ధునికి కరోనా సోకగా.. 20 రోజుల చికిత్స అనంతరం నెగిటివ్ రిపోర్టు రావడంతో ఇంటికి చేరుకున్నాడు. అయితే ఇప్పుడు అతని వ్యవహారశైలిలో మార్పులు చోటుచేసుకున్నాయి. కంటి చూపు మసకబారడమే కాకుండా, మతిమరపు సమస్యను ఎదుర్కొంటున్నాడు. స్నానం చేసిన తరువాత దుస్తులు ధరించడం మరచిపోతున్నాడు.

ఇదే ప్రాంతానికి చెందిన ఒక బ్యాంకు ఆఫీసర్ కరోనా బారిన పడ్డారు. 16 రోజుల అనంతరం వ్యాధి నుంచి కోలుకున్నారు. తరువాత అతనికి తీవ్రమైన తలనొప్పి ప్రారంభమైంది. దీంతో వైద్యులను సంప్రదించగా, వారు అతని సమస్యను గుర్తించి, చికిత్స అందించారు. అయితే అతను బ్యాంకుకు చేరుకున్నాక కంప్యూటర్ మొదలుకొని, కరెన్సీ చెస్ట్ లాక్‌కు సంబంధించిన అన్ని పాస్‌వర్డ్‌లను మరచిపోయారు. దీంతో వాటినన్నింటినీ రీసెట్ చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఆ బ్యాంకు ఆఫీసర్ కంప్యూటర్ ఫంక్షనింగ్ కూడా మరచిపోయారు. ఇతనిని పరీక్షించిన వైద్యులు ఈ సమస్యను ‘బ్రెయిన్ ఫాగ్’గా పేర్కొన్నారు.

కాన్పూర్‌లో ఇటువంటి నాలుగు కేసులు వెలుగు చూశాయి. ఈ సందర్భంగా కన్పూర్ మెడికల్ కాలేజీ న్యూరాలజీ హెడ్ ప్రొఫెసర్ అలోక్ వర్మ మాట్లాడుతూ కరోనా వైరస్ నరాలలోని రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. ఇదేవిధంగా దీర్ఘకాలం పాటు ఆక్సిజన్ సపోర్టుపై ఉన్న బాధితుల మెదడులోని నరాలు బలహీనపడతాయి. ఫలితంగా నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి ‘బ్రెయిన్ ఫాగ్’ సమస్య వృద్ధులలో కనిపిస్తోంది. దీని నివారణకు రెండు నుంచి మూడు నెలల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందన్నారు.