Donald Trump - Narendra Modi at Hyderabad House, New Delhi. | ANI Photo

New Delhi, February 25: దిల్లీలోని హైదరాబాద్ హౌజ్ (Hyderabad House)లో ఇండియా- యూఎస్ఎ మధ్య మంగళవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశం ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ప్రధాని నరేంద్ర మోదీ కలిసి సంయుక్త ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు, భారత్ - అమెరికా మైత్రి, ఇరు దేశాల మధ్య ట్రేడ్ పాలసీ, పలు అంశాల్లో ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి వివరణ ఇచ్చారు.

ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్- అమెరికా మధ్య గల మైత్రికి ప్రభుత్వాలు చేసిందేమి లేదు, ప్రజలతోనే అది కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ శతాబ్దానికి భారత్- అమెరికా మధ్య స్నేహం ఎంతో ప్రధానమైనది. 'నమస్తే ట్రంప్' చరిత్రలో నిలిచిపోతుంది అని మోదీ అన్నారు.

ప్రధాని మోదీ ప్రసంగంలోని అంశాలు

 

దేశ రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజలతో ప్రజలకు గల సత్సంబంధాలు సహా అమెరికా-భారత భాగస్వామ్యానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన అంశం ఈ సమావేశంలో చర్చించబడిందని అన్నారు.

ఇండియా- యూఎస్ఎ మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం మా భాగస్వామ్యంలో ప్రధానమైన అంశం అని మోదీ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య 3 అవగాహన ఒప్పందాలు (MoUs) సంతకం చేయబడ్డాయి. 1. మానసిక ఆరోగ్యంపై అవగాహన ఒప్పందం 2. భద్రత మరియు ఔషధాలు 3. ఇంధన వనరులకు సంబంధించి ఐయోసి మరియు ఎక్సాన్ మధ్య సహకారం.

ట్రేడ్ డీల్-  మన కామర్స్ మంత్రులు వాణిజ్యంపై సానుకూల చర్చలు జరిపారు. యూఎస్- ఇండియా మధ్య వాణిజ్యపరంగా సమాన అవకాశాలకు కట్టుబడి ఉన్నాము. పెద్ద పెద్ద ట్రేడ్ డీల్స్ జరిగేటపుడు చర్చించుకొని ముందుకు వెళ్లడంపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లు మోదీ వెల్లడించారు.

 

యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రసంగంలోని అంశాలు

 

అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఈ పర్యటన ఎంతో ప్రత్యేకమైనది, మరపురానిది, చారిత్రాత్మకమైనదిగా ట్రంప్ పేర్కొన్నారు. భారతదేశం నుంచి ఘనమైన స్వాగతం లభించింది. భారత ప్రజలు చూపిన ప్రేమ, ఆప్యాయతలు అమోఘం. దీనిని మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటామ అని ట్రంప్ అన్నారు. ఈ పర్యటన ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇరు దేశాలు భాగస్వామ్య విలువలు పాటిస్తాయి కాబట్టి ఇండియా- యూఎస్ఎ ఎప్పటికీ మిత్రదేశాలని పేర్కొన్నారు.   మహత్ముడి చరఖాతో నూలు వడికిన అమెరికా అధ్యక్షుడు

ఈరోజు సమావేశంలో ఇరు దేశాల మధ్య సమగ్రమైన వాణిజ్య ఒప్పందంపై దృష్టి పెట్టాం. న్యాయమైన మరియు పరస్పర సమ్మతమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను రూపొందించడంలో ఇరుపక్షాలు పురోగతి సాధించాయని తెలిపారు.

"ఇరు దేశాలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చే ఒప్పందంపై నేను ఆశాభావంతో ఉన్నాను" అని ట్రంప్ అన్నారు. భారతదేశానికి అమెరికా ఎగుమతులు దాదాపు 60 శాతం పెరిగాయని, అధిక నాణ్యత గల అమెరికన్ ఇంధన ఎగుమతులు 500 శాతం పెరిగాయని తెలిపారు. ఇంధన రంగం సహా 3 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసినట్లు స్పష్టం చేశారు.

భారతదేశం మరియు యూఎస్ మధ్య 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు ఖరారు అయ్యాయని యూఎస్ ప్రెసిడెంట్ వెల్లడించారు. అందులో భాగంగా అత్యంత అధునాతనమైన అపాచీ మరియు ఎంహెచ్ -60 రోమియో హెలికాప్టర్లలను భారతదేశానికి అందజేస్తూ తమ రక్షణ సహాకారాన్ని విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇక వీటితో పాటు 5జీ వైర్ లెస్ నెట్ వర్క్, సైబర్ సెక్యూరిటీ, డ్రగ్స్ నిర్మూలన, ఇండో- పసిఫిక్ ప్రాంతంలో భద్రతాపరమైన అంశాలు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు ట్రంప్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.