PM Modi Bangla Tour: 'బంగబంధు బ్రతికి ఉంటే బంగ్లాదేశ్ మరో స్థాయిలో ఉండేది'! బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని, కోవిడ్19 వ్యాప్తి తర్వాత నరేంద్ర మోదీ చేస్తున్న మొదటి విదేశీ పర్యటన ఇదే
File image of PM Narendra Modi and Bangladesh PM Sheikh Hasina. (Photo Credits: IANS)

New Delhi, March 26: బంగ్లాదేశ్ 50వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బంగ్లాదేశ్ వచ్చారు. నేడు మరియు రేపు రెండు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. COVID-19 వ్యాప్తి తరువాత మోదీ చేసిన మొదటి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. శుక్రవారం ఉదయం ఢాకా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సాదర స్వాగతం పలికారు. తొలిరోజు షెడ్యూల్ లో భాగంగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఎకె అబ్దుల్ మోమెన్ మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:45 గంటలకు జాతీయ దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు, తరువాత రాత్రి 7:45 గంటలకు బంగబందు డిజిటల్ వీడియో ఎగ్జిబిషన్ ను మోదీ ప్రారంభించనున్నారు.

బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ఆ దేశ తొలి అధ్యక్షుడు, బంగ్లాదేశ్ దేశ పితామహుడు, బంగబంధుగా పిలువబడే షేక్ ముజిబూర్ రెహ్మాన్ సేవలను మోదీ గుర్తు చేసుకున్నారు. బంగబంధు జీవితం మరియు ఆదర్శాలు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని మోదీ అన్నారు. ముజిబూర్ రెహ్మాన్ హత్య దక్షిణాసియా పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిందని, ఆయనే బ్రతికి ఉంటే బంగ్లాదేశ్ మరో స్థాయిలో ఉండేదని మోదీ అభిప్రాయపడ్డారు. బంగబంధు ఉండి ఉంటే భారత్- బంగ్లాదేశ్ మధ్య 2015 జరిగిన సరిహద్దు ఒప్పందం ఎప్పుడో పూర్తయి ఉండేదని మోడీ పేర్కొన్నారు. భారత్ - బంగ్లా మధ్య ధృడమైన భాగస్వామ్యం కోసం మళ్లీ అడుగులు పడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తన ఈ పర్యటనకు ముందు ఆ దేశ పత్రిక 'ది డైలీ స్టార్' లో రాసిన కథనంలో పేర్కొన్నారు.

రెండో రోజు, శనివారం నాడు భారత ప్రధాని మరియు బంగ్లా ప్రధాని ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇరు దేశాలకు సంబంధించి జరిపే ద్వైపాక్షిక చర్చల్లో కీలక అవగాహన ఒప్పందాలకు ఇరువురు ప్రధానులు సంతకం చేసే అవకాశం ఉంది.

ఈ భేటీ అనంతరం ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ అబ్దుల్ హమీద్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. దీని తర్వాత మోదీ తిరిగి దిల్లీ చేరుకోనున్నారు.

"భారత ప్రధాని పర్యటన తమకు ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మరియు ఇది బంగ్లా- భారత్ మధ్య సమగ్ర వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది" ఆ దేశ విదేశాంగ కార్యదర్శి హర్ష్ ష్రింగ్లా మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

మార్చి 26, 1971న, బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా బంగాబందు షేక్ ముజిబూర్ రెహ్మాన్ ప్రకటించారు. ఇది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి దారితీసింది. భారత మద్దతుతో పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ విముక్తి దళాల మధ్య గెరిల్లా యుద్ధం జరిగింది.