Vladivostok, September 4: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narenddra Modi) రెండు రోజుల పర్యటన కోసం రష్యా (Russia) వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు రష్యాలోని వ్లాదివోస్టాక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి సాదర స్వాగతం లభించింది. అక్కడి భద్రతా సిబ్బంది మోదీకి గౌరవ వందనం సమర్పించారు.
మోదీకి ఆత్మీయ స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు విమానాశ్రయానికి వచ్చారు. రష్యాలో జరుగుతున్న 5వ తూర్పు ఆర్థిక ఫోరమ్ సదస్సుకు హాజరయ్యేందుకు ముఖ్యఅతిథిగా భారత ప్రధాని ఇక్కడకు విచ్చేశారు.
5వ తూర్పు ఆర్థిక ఫోరమ్ సదస్సుతో పాటుగానే రష్యా- భారత్ 20వ వార్షిక సమావేశం కూడా జరగనుంది. ఆర్థిక ఫోరమ్ సదస్సులో భాగంగా ప్రపంచ దేశాలకు చెందిన డెలిగేట్స్ తో వివిధ రకాల వాణిజ్య అంశాలపై చర్చించనున్నారు, ఇక రష్యాతో వార్షిక సమావేశంలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాల అజెండాగా చర్చ సాగనుంది.
విమానాశ్రయంలో గౌరవ వందనంతో ప్రధాని మోదీకి స్వాగతం:
#WATCH Prime Minister Narendra Modi receives guard of honour, on his arrival in Vladivostok. He is on a 3-day visit to Russia. pic.twitter.com/o5AMKrd6zy
— ANI (@ANI) September 3, 2019
తన మూడు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజున ప్రధాని మోదీ ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో భేటీ కానున్నారు. భారత కు రష్యా విశ్వసనీయమైన మిత్ర దేశం. మొన్నటి ఐరాస అనధికార సమావేశంలో కూడా కాశ్మీర్ అంశంపై రష్యా భారత్ వైపే నిలిచింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య స్నేహం, సహాయ సహాకారాలు కొనసాగేలా వీరి సమావేశం కొనసాగనుంది. భారత్- రష్యా మధ్య అనేక ద్వైపాక్షిక అంశాలపై మోదీ మరియు పుతిన్ చర్చించుకోనున్నారు.
ఇండియా-రష్యా మధ్య రక్షణ సహాకార సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ప్రధాని మోదీ ముఖ్యంగా చర్చించనున్నారు.
మిలటరీ సంబధిత సామాగ్రిని ఇండియాలో తక్కువ వ్యయంతోనే తయారు చేసి వాటిని మిగతా దేశాలకు తక్కువ ధరకే అందించేలా రష్యా- భారత్ జాయింట్ వెంచర్ ప్రారంభించడాన్ని పుతిన్ వద్ద మోదీ ఒక ప్రతిపాదన తీసుకురానున్నట్లు సమాచారం.
ఈరోజు రష్యా అధ్యక్షుడితో భేటీ సందర్భంగా భారత్ మరియు రష్యాల ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఉత్సాహం తీసుకువస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సదస్సులో భాగంగా ఇరు దేశాలు రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, పారిశ్రామిక సహకారం, ఇంధనం మరియు కనెక్టివిటీ కారిడార్లలో అనేక ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.