New Delhi, May 11: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)జూన్ నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు మోదీ అమెరికా వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 22న ప్రధాని మోదీ కోసం జో బైడెన్, జిల్ బైడెన్ స్టేట్ డిన్నర్‌ను (State Dinner) ఏర్పాటు చేస్తారని కేంద్రం తెలిపింది. జీ20 కూటమికి ఈ ఏడాది భారత్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కె జీన్ పియర్ మాట్లాడారు. జో బైడెన్, జిల్ బైడెన్ (Jil Biden) అధికారిక రాష్ట్ర పర్యటన కోసం అమెరికాలో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారని తెలిపారు. అంతేకాక, వైట్ హౌస్‌లో జూన్ 22న స్టేట్ డిన్నర్ ఏర్పాటు చేస్తారని తెలిపారు.
భారత ప్రధాని పర్యటన రెండు దేశాల మధ్య బలమైన, సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.మోదీ, బైడెన్ కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పలు రంగాల బలోపేతంపై రెండు దేశాలు ఇప్పటికే పరస్పరం సహకరించుకుంటున్నాయి. సాంకేతికత, వాణిజ్యం, పరిశ్రమలు, పరిశోధన, విద్య, క్లీన్ ఎనర్జీ, రక్షణ, భద్రత వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సహకారంపై ఇద్దరు నాయకులు సమీక్షించే అవకాశాలు ఉన్నాయి.
అయితే, ప్రధాని అమెరికా పర్యటన ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు కొనసాగుతుందనే విషయంపై స్పష్టత లేదు. జూన్ 21 నుంచి నాలుగు రోజుల పాటు ప్రధాని అమెరికా పర్యటన ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదిలాఉంటే బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత 2021లో ప్రధాని మోదీ వైట్ హౌస్‌లో ఆయన్ను కలిశారు.