Mascow, SEP 30: దాదాపు ఎనిమిది నెలల నుంచి జరుగుతోన్న ఉక్రెయిన్ యుద్ధంలో (Ukraine Crisis) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, జపోరిజియా, లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాలు రష్యాలో విలీనం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ప్రజాభిప్రాయ సేకరణ (Referendums) ద్వారానే ఉక్రెయిన్‌లోని ఈ నాలుగు ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు తెలపిన పుతిన్ (Putin).. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చర్చలకు రావాలని ఉక్రెయిన్‌కు సూచించిన పుతిన్.. కొత్తగా విలీనం చేసుకున్న ప్రాంతాలను మాత్రం రష్యా (Russia) ఎట్టిపరిస్థితుల్లో వదులుకోదని తేల్చి చెప్పారు.
‘ఉక్రెయిన్‌కు చెందిన 15శాతం భూభాగం రష్యాలో కలిసింది. అన్ని బలగాలను ఉపయోగించి ఈ ప్రాంతాలను రక్షించుకుంటాం. ఇక్కడి ప్రజలకు భద్రత కల్పించేందుకు ఏదైనా చేస్తాం. ఇది లక్షల మంది నిర్ణయం. కీవ్ పాలనలో దారుణమైన ఉగ్ర దాడులతో డాన్బాస్ ప్రజలు బాధితులుగా మిగిలారు. సైనిక చర్యలను ఆపి ఉక్రెయిన్ చర్చల వేదిక వద్దకు రావాలి. ఇదే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా లక్షల మంది తెలియజేసిన భావప్రకటనను గౌరవించాలి’ అని క్రెమ్లిన్‌లో జరిగిన సమావేశంలో వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించారు.
గతంలో జరిగిన విలీన ప్రక్రియను ప్రస్తావించిన పుతిన్.. పాశ్చాత్య దేశాల తీరుపై మండిపడ్డారు. క్రిమియా పౌరుల నిర్ణయంపైనా పాశ్చాత్య దేశాలు చాలా కోపంగా ఉన్నాయన్న ఆయన.. తమపై దాడి చేసేందుకు అవి కొత్త అవకాశాల కోసం చూస్తున్నాయని ఆరోపించారు. తమ రాజ్యాన్ని ముక్కలుగా చేయాలని కలలు కంటున్నాయని.. ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు వాటికి లేదన్నారు. అనంతరం కొత్తగా విలీనం జరిగిన ఆయా ప్రాంతాలకు చెందిన పరిపాలకులతో సంబంధిత ఒప్పందాలపై పుతిన్ సంతకాలు చేశారు. మరోవైపు, రెఫరెండం పేరుతో రష్యా చేపట్టిన తాజా విలీన ప్రకటనపై ఉక్రెయిన్ సహా పాశ్చాత్య దేశాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.