Tokyo, Sep 29: జపాన్ సైన్యంలో (Japan Army) మహిళలపై లైంగిక వేధింపులు (Sexual Harassment) జరిగాయని అక్కడి సైన్యం అంగీకరించింది. ఇందుకు క్షమాపణ (Japan's army chief issues rare apology) కోరుతున్నామని తెలిపింది. ఓ మాజీ సైనికురాలికి తోటి సిబ్బంది నుంచి ఎదురైన వేధింపులపై జరిపిన దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడైనట్లు జపాన్ ఆర్మీ అధికారికంగా వెల్లడించింది. గత నెలలో మాజీ మహిళా సైనికురాలు తీసుకొచ్చిన కేసులో (sexual harassment case) పలువురు సైనికులు ప్రమేయం ఉన్నట్లు అంతర్గత దర్యాప్తులో ఆధారాలు లభించాయని జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అధిపతి యోషిహిడే యోషిడా తెలిపారు.
రీనా గొనోయ్ అనే మాజీ సైనికురాలు తాను తోటి సైనికుల నుంచి ఎంతోకాలం పాటు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనతోపాటు ఎంతో మంది మహిళలు వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రక్షణశాఖ.. ఆమె ఆరోపణలపై అంతర్గత దర్యాప్తు జరిపించింది. ఆ దర్యాప్తులో రీనా చేసిన ఆరోపణలు నిజమని తేలాయి. ఈ నేపథ్యంలో ‘లైంగిక వేధింపుల వల్ల సుదీర్ఘకాలం పాటు ఎంతో వేదనను ఎదుర్కొన్న రీనా గొనోయ్‌కు క్షమాపణలు కోరుతున్నా’ అని విలేకరుల సమావేశంలో గ్రౌండ్-సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ యోషిహిదే యోషిదా పేర్కొన్నారు.
సర్వీసులో ఉన్న సమయంలో (2021 ఆగస్టు) ముగ్గురు మగ సైనికాధికారులు నా శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. తమ శరీరాల కింది భాగాన్ని తనపైకి నొక్కి, కాళ్లు చాచమని బలవంతం చేశారని, మరో 10 మందికి పైగా మగ సహచరులు చూసి నవ్వారని, అయితే ఎవరూ ఆపడానికి ప్రయత్నించలేదని బాధితురాలు తెలిపింది.ఆ దారుణంపై ఫిర్యాదు చేసినప్పటికీ సరైన దర్యాప్తు చేయకుండానే దానిని మూసివేశారు’ అంటూ తనకు జరిగిన అన్యాయంపై రీనా గొనోయ్ సోషల్ మీడియాలో గళమెత్తారు. అనంతరం సైన్యం నుంచి కొన్నిరోజుల క్రితం రాజీనామా చేసిన గొనోయ్.. సైనిక అధికారులపై న్యాయపోరాటానికి దిగారు.
ఇందుకు సంబంధించి 2021లో చేసిన ఫిర్యాదుపై మరోసారి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ లక్ష మంది సంతకాలతో కూడిన పిటిషన్‌ను రీనా గొనోయ్ రక్షణశాఖకు అందించారు. తనకు జరిగినట్లుగానే సర్వీసులో ఉండగా వేధింపులకు గురైనట్లు 146 మంది తనకు సమాచారం ఇచ్చారని అందులో పేర్కొన్నారు. ఇలా రీనాతోపాటు సైన్యంలో లైంగిక వేధింపులకు సంబంధించి వస్తోన్న ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన జపాన్ రక్షణశాఖ మంత్రి యసుకజూ హమదా.. వీటిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు.
ఈ బాధ్యతను ఆమె పనిచేసిన రీజినల్ ఆర్మీ డివిజన్‌కు అప్పజెప్పారు. వీటిపై దర్యాప్తు చేసిన అనంతరం గొనోయ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని గ్రౌండ్-సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ అంగీకరించారు. ఇందుకు క్షమాపణ కోరిన ఆయన.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.వివిధ రకాల వేధింపుల ఫిర్యాదుల సంఖ్య 2016లో 256 కాగా, గతేడాది 2,311కి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.