
Moscow, July 6: 29 మందితో వెళుతోన్నరష్యా విమానం ఆచూకీ గల్లంతైంది. రష్యాలోని మారుమూల దీవి అయిన కాంచాక్తాలో ఈ ఘటన (Russian Aircraft Missing) జరిగింది. పెట్రోపావ్లోస్క్ నుంచి పాలానాకు వెళ్లిన ఏఎన్ 26 విమానం ల్యాండ్ అవుతుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో అనుసంధానం కోల్పోయిందని ఆ దేశ ఎమర్జెన్సీ శాఖ ప్రకటించింది.
విమానంలో ప్రయాణిస్తున్న 29 మందిలో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులున్నట్టు (Russian Aircraft With 29 People) అధికారులు చెబుతున్నారు. విమానం రేడార్ల నుంచి అదృశ్యమైనట్లు అధికారులు గుర్తించారు. ఒకరిద్దరు చిన్నారులూ ఉన్నారని అంటున్నారు. విమానం అనుసంధానం కోల్పోయిన ప్రాంతానికి సహాయ బృందాలు హుటాహుటిన వెళ్లాయి. అప్పటికే కాంటాక్ట్ కోల్పోయిన విమానం కోసం గాలింపు ముమ్మరం చేశారు.
ఘటన సమయంలో ఆకాశంలో దట్టమైన మేఘాలు అలముకున్నాయని, వాతావరణం బాగాలేదని అధికారులు చెబుతున్నారు. కాగా, ఒకప్పుడు విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగే రష్యాలో గత కొన్నేళ్లుగా ఆ పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఎయిర్ ట్రాఫిక్ సేఫ్టీని ఆ దేశ ప్రభుత్వం పటిష్ఠపరిచింది. అయితే, విమానాల నిర్వహణలో లోపాలు, అత్యంత హీన స్థితిలో భద్రతా ప్రమాణాలున్నాయన్న విమర్శలున్నాయి.
కాగా విమానం సముద్రంలో పడిపోయిందా లేక ల్యాండింగ్ సమయంలో పలానా ప్రాంతంలోని బొగ్గుగనిలో కూలిపోయి ఉంటుందా అని అధికారుల సందేహం వ్యక్తం చేస్తున్నారు. విమానం ఆచూకీ కనిపెట్టేందుకు రెండు హెలికాప్టర్లలో సహాయక సిబ్బంది బయల్దేరారు.